Kane Williamson: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఓటమి… కేన్ విలియమ్సన్ రిటైర్మెంట్‌పై స్పష్టత ఇచ్చిన సౌథీ..!

2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత జట్టు చేతిలో ఓడిపోయిన తర్వాత, న్యూజిలాండ్ జట్టు తీవ్ర నిరాశతో ఇంటికి తిరిగి వెళ్లింది. ఫైనల్ మ్యాచ్ అనంతరం కివీస్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ కళ్లలో నీళ్లు తిరిగాయి. జట్టు మొత్తం క్షోభను వ్యక్తం చేస్తుంటే, న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ రిటైర్మెంట్‌పై పలు ఊహాగానాలు వినిపించాయి. అయితే, దీనిపై న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో న్యూజిలాండ్ జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. కానీ, ఫైనల్ పోరులో భారత జట్టు దాటికి నిలువలేకపోయింది. భారత్ చేతిలో ఓడిపోయిన తర్వాత, న్యూజిలాండ్ ఆటగాళ్లలో నిరాశ నెలకొంది. ముఖ్యంగా, విలియమ్‌సన్ భవిష్యత్తుపై అనేక సందేహాలు చుట్టుముట్టాయి. అతను రిటైర్ కావొచ్చని పలు నివేదికలు వెలువడ్డాయి.

ఫైనల్ అనంతరం భారత క్రికెట్ జట్టు సంబరాల్లో మునిగితేలగా, కివీస్ ఆటగాళ్లు ఆ బాధను తట్టుకోవడం చాలా కష్టం అనిపించింది. ఇంతటి నిరాశ దృష్ట్యా, 34 ఏళ్ల కేన్ విలియమ్‌సన్ ఇక క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నాడా? అన్న ప్రశ్న అభిమానుల్లో తలెత్తింది.

ఈ ఊహాగానాలపై న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ స్పందిస్తూ, “కేన్ విలియమ్సన్ ఇప్పటికీ మూడు ఫార్మాట్లలోనూ ఆడుతున్నాడు. శీతాకాలంలో కౌంటీ క్రికెట్ కాంట్రాక్ట్ కూడా కలిగి ఉన్నాడు. పరుగులు సాధించాలనే అతని దాహం ఇంకా సజీవంగా ఉంది. ఇది స్పష్టంగా అతని కమిట్‌మెంట్‌ను చాటుతుంది. తదుపరి వన్డే ప్రపంచ కప్‌కు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అతనికి పరిమిత క్రికెట్ ఆడే అవకాశాన్ని ఇవ్వాలని కోరుకుంటోంది. తద్వారా అతను 2027 వన్డే ప్రపంచ కప్‌లో జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తాడు. 34 ఏళ్ల వయస్సులో కూడా, అతను చాలా చిన్నవాడిగా కనిపిస్తున్నాడు. అతనిలోని ఆకలి ఇంకా సజీవంగానే ఉంది” అంటూ చెప్పుకొచ్చాడు.

కేన్ విలియమ్సన్ ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో గొప్ప బ్యాటింగ్ నైపుణ్యాన్ని మరోసారి ప్రదర్శించాడు. ఐదు ఇన్నింగ్స్‌లలో 47.25 సగటుతో 189 పరుగులు చేశాడు. అందులో ఒక శతకంతో తన క్లాస్‌ను నిరూపించుకున్నాడు. జట్టు విజయానికి ఎంతగానో కృషి చేసినప్పటికీ, ఫైనల్లో భారత్ చేతిలో ఓడిపోవడం అతనిని కలచివేసింది.

ప్రస్తుతం విలియమ్సన్ దృష్టి 2027 వన్డే ప్రపంచ కప్‌పై ఉంది. అతను ఆ కప్ కోసం తన పూర్తి శక్తిని వినియోగించాలనుకుంటున్నాడు. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు కూడా అతనిపై పూర్తి నమ్మకం ఉంచింది. అతని నైపుణ్యం, అనుభవం జట్టుకు బలంగా నిలుస్తాయని భావిస్తోంది.

కివీస్ అభిమానులు ఇప్పటికీ అతన్ని జట్టులో చూడాలని కోరుకుంటున్నారు. కేన్ విలియమ్సన్ రిటైర్మెంట్ అనేది ఇప్పటికీ ఊహాగానంగానే ఉంది. కానీ, అతని ఆటతీరు చూస్తే, ఇప్పుడే ఆటకు గుడ్‌బై చెప్పడని స్పష్టమవుతోంది.

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ ఓటమి తర్వాత న్యూజిలాండ్ జట్టు నిరాశలో మునిగిపోయినప్పటికీ, కేన్ విలియమ్సన్ ఇంకా ముందుకు సాగేందుకు సిద్ధంగా ఉన్నాడు. అతనిలోని ఆత్మవిశ్వాసం, నిబద్ధత 2027 వరల్డ్ కప్ వరకు న్యూజిలాండ్ జట్టుకు బలంగా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Leave a Reply