Revanth Reddy: ఇలా అయితే పార్టీకి నష్టం… ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇకనైనా మారండి!

తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రతిపక్షాల విమర్శలకు సమర్థంగా స్పందించకపోవడం, కొందరు ఎమ్మెల్యేల నిర్లక్ష్య వైఖరితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ సభ్యుల పనితీరుపై ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాలకు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పూర్తిగా హాజరుకావాలని ఆదేశిస్తూ, ప్రతిపక్షాల ఆరోపణలకు తగిన సమాధానాలు ఇవ్వాలని సూచించారు.

అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన సీఎల్పీ (కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ) సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక సూచనలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవి రెండో పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలని ఆయన స్పష్టం చేశారు. గత 15 నెలల్లో ప్రజా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై చర్చించుకోవడానికి ఈ సమావేశాలు మంచి అవకాశం అని తెలిపారు. అయితే కొందరు ఎమ్మెల్యేలు అసెంబ్లీని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. కొందరు సభ్యులు అసెంబ్లీకి హాజరైనా పూర్తిస్థాయిలో చర్చల్లో పాల్గొనకపోవడమే. సీఎల్పీ సమావేశంలో రేవంత్ మాట్లాడుతుండగా, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జైవీర్ సమావేశం మధ్యలో బయటకు వెళ్లడం చూసి ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. “ఇంత సీరియస్‌గా చర్చ జరుగుతున్నా, ఇలా నాన్ సీరియస్‌గా ఉంటే ఎలా?” అంటూ ప్రశ్నించారు. “మనం మరోసారి గెలవాలంటే, ప్రతీ ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి. రాజకీయాలు అంటే పిల్లల ఆటలు కావు” అని ఆయన స్పష్టం చేశారు.

రేవంత్ రెడ్డి ప్రకటనలో ప్రజా సమస్యలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజా అభిప్రాయాలను అసెంబ్లీలో బలంగా ప్రస్తావించాలని పిలుపునిచ్చారు. “ప్రతిపక్షాలు మన ప్రభుత్వంపై విమర్శలు చేయడమే కాదు, అసెంబ్లీలో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తాయి. అలాంటి సందర్భాల్లో మనం సమర్థంగా స్పందించాలి” అని ఆయన సూచించారు.

అంతేకాకుండా, ప్రస్తుత రాజకీయ కాలంలో సోషల్ మీడియా పాత్ర ఎంతో కీలకమని సీఎం రేవంత్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ విజయాలను ప్రజలకు చేరవేసేందుకు సోషల్ మీడియా వేదికను ఉపయోగించుకోవాలని, ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండాలని ఆయన సూచించారు. “ప్రతిపక్షాల ఆరోపణలకు వెంటనే స్పందించండి. ప్రజల్లో మంచి పేరును నిలబెట్టుకోవాలి అంటే, మీడియా ద్వారా మన పనులు ప్రజలకు చూపించాలి” అని ఆయన చెప్పారు.

సీఎం రేవంత్, అసెంబ్లీలో సీరియస్‌గా వ్యవహరించకపోతే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని హెచ్చరించారు. “ఒక్కసారి గెలవడం గొప్ప కాదు, మరోసారి గెలవడమే అసలు గొప్ప. కొందరు బీఆర్ఎస్ పట్ల సైలెంట్‌గా ఉంటున్నారు. అలా చేస్తే మీ మీద అభ్యర్థిని పెట్టరు అనుకుంటున్నారా? అలా అస్సలు ఊహించుకోకండి. వాళ్ల గురించి నాకు బాగా తెలుసు” అని ఆయన స్పష్టం చేశారు.

సీఎం రేవంత్, ఏప్రిల్ 6న అన్ని జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి లంచ్ మీటింగ్ ఏర్పాటు చేయాలని ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరి పనితీరుపై సమీక్షించి, ప్రభుత్వ విజయాలను ప్రజలకు ఎలా చేరవేయాలన్న దానిపై చర్చించనున్నట్లు తెలిపారు. “రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అన్నింటికీ ధైర్యంగా ముందుకెళ్లాలి. ఒకసారి ప్రజా ప్రతినిధిగా గెలిచినప్పుడు, ప్రజా సమస్యల పరిష్కారంలో శ్రమించాలి. అప్పుడే ప్రజలు మళ్లీ మనపై నమ్మకాన్ని ఉంచుతారు” అని ఆయన ఎమ్మెల్యేలకు సూచించారు.

సీఎం రేవంత్ రెడ్డి చివరిగా ఎమ్మెల్యేలకూ, ఎమ్మెల్సీలకూ గట్టిగా హెచ్చరిక చేశారు. “మీరు మారకపోతే, ప్రభుత్వానికి మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీకి కూడా నష్టం. ఇప్పుడైనా మారండి, ప్రజా సమస్యలను పట్టించుకోండి” అంటూ వారిపై ఒత్తిడి తీసుకొచ్చారు. మరి రేవంత్ సూచనలతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మారతారా? లేదా? అన్నది వేచి చూడాలి.

Leave a Reply