Posani Krishna Murali: బెయిల్ లేకుంటే ఆత్మహత్యే… గుంటూరు కోర్టులో పోసాని భావోద్వేగం..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న పోసాని కృష్ణ మురళి కేసు కొత్త మలుపు తీసుకుంది. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేశ్‌లపై అసభ్య వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో గుంటూరు సీఐడీ అధికారులు ఐదు నెలల క్రితం పోసానిపై కేసు నమోదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఆయన మీద కేసులు నమోదయ్యాయి.

కొన్ని రోజుల క్రితం ఏపీ పోలీసులు పోసానిని అరెస్ట్ చేశారు. అప్పటినుంచి బెయిల్‌పై ఊహాగానాలు వినిపించగా, ఈ రోజు ఆయన విడుదల కాబోతున్నారని వార్తలు వచ్చాయి. కానీ, అనూహ్యంగా గుంటూరు సీఐడీ అధికారులు పోసానిపై పీటీ వారెంట్ దాఖలు చేయడంతో కోర్టు విచారణ మరోసారి వాయిదా పడింది.

ఈ క్రమంలో గుంటూరు మెజిస్ట్రేట్ ముందు పోసాని భావోద్వేగానికి గురయ్యారు. “నాకు బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్యే శరణ్యం” అంటూ ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. “నా మీద ఎన్ని కేసులు పెట్టారో తెలియదు… రాష్ట్రమంతా తిప్పుతున్నారు. నా ఆరోగ్యం బాలేదు, రెండు ఆపరేషన్లు అయ్యాయి. ఇప్పుడు చాలా బాధపడుతున్నాను,” అంటూ తన ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పారు.

“తప్పు చేస్తే నరికేయండి, కానీ ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదు,” అని పోసాని వాపోయారు. అంతేకాదు, తనపై వ్యక్తిగత కక్షతోనే ఈ కేసులు వేశారని ఆయన కోర్టులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఈ వాదనలు విన్న అనంతరం, కోర్టు తదుపరి విచారణకు కేసును వాయిదా వేసింది. ఇక పోసాని బెయిల్ ఏమవుతుందో అన్నది ఆసక్తిగా మారింది.

Leave a Reply