టాలీవుడ్ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళికి ఊహించని షాక్ తగిలింది. అన్ని కేసుల్లో బెయిల్ రావడంతో ఈరోజు ఆయన జైలు నుంచి విడుదల అవుతారని భావించిన వేళ, ఏపీ సీఐడీ అధికారులు కొత్త ట్విస్ట్ ఇచ్చారు. పోసానిపై పీటీ వారెంట్ దాఖలు చేయడం వల్ల ఆయన విడుదల వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం, నారా లోకేశ్‌ల గురించి సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారంటూ గుంటూరు సీఐడీ అధికారులు ఐదు నెలల క్రితం పోసాని కృష్ణ మురళిపై కేసు నమోదు చేశారు. ఈ కేసుల్లో అన్ని కోర్టుల నుంచి బెయిల్ పొందడంతో ఆయన విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే, అనూహ్యంగా సీఐడీ అధికారులు గుంటూరు కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేయడం చర్చనీయాంశమైంది.
కోర్టు ఈ పీటీ వారెంట్‌ను అనుమతించగా, దీనిపై ఇవాళ విచారణ జరగనుంది. కర్నూలు జైలు నుంచే పోసాని కృష్ణ మురళిని ఆన్లైన్ ద్వారా జడ్జి ఎదుట హాజరుపర్చనున్నారు. పోలీసులు దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విచారణ ఫలితాన్ని బట్టి పోసాని విడుదల ఆలస్యం కావచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ పరిణామాలపై వైసీపీ నేతలు, పోసాని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే ఈ వ్యవహారాన్ని లాగడాన్ని మండిపడుతున్నారు. మరోవైపు, ఆదోని, విజయవాడ కోర్టుల్లో పోసాని కృష్ణ మురళికి నిన్న బెయిల్ మంజూరు కాగా, రాజంపేట, నరసరావుపేట కోర్టుల్లో ఇప్పటికే ఆయనకు రిలీఫ్ లభించింది. హైకోర్టు కూడా మిగతా కేసుల్లో BNS చట్టంలోని 353 సెక్షన్ కింద నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది.
ప్రస్తుతం కర్నూలు జైల్లో ఉన్న పోసాని కృష్ణ మురళి, అన్ని కేసుల్లో రిలీఫ్ రావటంతో ఇవాళ విడుదల అవుతారని అనుకున్నారు. కానీ, సీఐడీ అధికారులు వేసిన పీటీ వారెంట్‌తో పోసాని కేసులో మరో మలుపు ఏర్పడింది. ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.