ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారిన ఓ కేసుకు కోర్టు న్యాయస్థానం ముగింపు పలికింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా వారి కుటుంబాలను దూషించిన కేసులో అరెస్టైన వైసీపీ నేత, రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ ఎట్టకేలకు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో లొంగిపోయాడు. గత కొద్దిరోజులుగా అతను లొంగిపోతాడా? లేదా? అన్న ఉత్కంఠకు ఇప్పుడు తెరపడింది.
బోరుగడ్డ అనిల్ తన తల్లి ఆరోగ్యం బాగోలేదని కోర్టును నమ్మించి మధ్యంతర బెయిల్ పొందాడు. అయితే ఈ బెయిల్ గడువు నిన్నటితో ముగియడంతో అతను తిరిగి లొంగిపోవాల్సిన అవసరం వచ్చింది. అయితే, కోర్టు ముందుగా ఈ నెల 11వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు రాజమహేంద్రవరం జైలు సూపరింటెండెంట్ ముందు లొంగిపోవాలని స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. కానీ అనిల్ ఇంకా బెయిల్ పొడిగించుకోవడానికి ప్రయత్నించాడు.
అతని న్యాయవాదులు తల్లి ఆరోగ్య సమస్య ఇంకా సీరియస్ గానే ఉందని కోర్టును నచ్చజెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ, హైకోర్టు ఈ వాదనను ఖండించింది. అసలు మధ్యంతర బెయిల్‌ను మరింత పొడిగించే ప్రసక్తే లేదని కోర్టు తేల్చిచెప్పడంతో అతనికి ఊహించని షాక్ తగిలింది.
ఇక అనిల్ బెయిల్ పొడిగించుకునేందుకు తల్లి అనారోగ్యాన్ని సాకుగా వాడుకోవడమే కాకుండా, నకిలీ మెడికల్ సర్టిఫికెట్లు సృష్టించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ నెల 1వ తేదీన నకిలీ పత్రాలతో మధ్యంతర బెయిల్ పొడిగించుకున్న అనిల్, మరొకసారి అదే పని చేయాలని చూసినా హైకోర్టు అతనికి అడ్డుకట్ట వేసింది.
హైకోర్టు స్పష్టమైన తీర్పుతో బెయిల్ పొడిగించుకునే అవకాశమే లేకపోవడంతో అనిల్ ఇక జైలుకు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. అనివార్యంగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు వచ్చి లొంగిపోయాడు.
ఈ కేసు రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఒక వైపు టీడీపీ, జనసేన శ్రేణులు ఈ ఘటనను తమ విజయంగా చెబుతున్నాయి. మరోవైపు వైసీపీ వర్గాలు మాత్రం దీన్ని రాజకీయ కక్షసాధింపుగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నాయి.
ఏదేమైనా, నేరపూరిత చరిత్ర ఉన్న బోరుగడ్డ అనిల్‌కు తప్పించుకునే మార్గం లేకపోవడంతో, ఆయన ఎట్టకేలకు జైలుకెళ్లడం ఖాయమైంది. ఇది వైసీపీ వర్గాల్లో కొంత కలకలం రేపిన అంశంగా మారింది.