ఎలాన్ మస్క్ ఈ పేరు వింటే టెక్నాలజీ పురివిప్పి నాట్యం చేస్తుంది. కృషి..పట్టుదల..లక్ష్యం పులకరించిపోతాయి. మనిషి మేధస్సుకు ఎదురులేదు అనిబలంగా నమ్మే ఓ నిరంతరకృషీవలుడు మస్క్. ఫెల్యూర్ లేని చోట సక్సెస్ వుండదు అంటారు. గతంలో కొన్ని వైఫల్యాలను అధిగమించి గ్రేట్ సక్సెస్ ను సొంతం చేసుకున్న ఎలాన్ మస్క్.. నిన్న టెక్సాస్ నుండి ఎగిరిన స్పేస్ ఎక్స్ స్టార్ షిప్ వైఫల్యాన్ని ఛాలెంజింగ్ భరించాల్సి వచ్చింది. ఎలాన్ మస్క్ కు చెందిన అంతరిక్ష నౌక స్పేస్ ఎక్స్ స్టార్ షిప్ కొన్ని నిమిషాలకే అంతరిక్షంలోనే పేలిపోయింది. తొలుత ప్రయోగం విజయవంతమైనట్లే కనిపించినా నిమిషాల వ్యవధిలో ఈ భారీ అంతరిక్ష నౌక గాల్లోనే పేలిపోయింది. దీంతో ఎలాన్ మస్క్ సంస్థ చేపడుతున్న అంతరిక్ష ప్రయోగాలకు అనుకోని ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
అంతే కాదు స్పేస్ ఎక్స్ ఖాతాలో మరో ఫెయిల్యూర్ వచ్చి చేరింది. స్పేస్ ఎక్స్ స్టార్ షిప్ అంతరిక్షంలోనే పేలిపోవడంతో దీని ప్రభావంవల్ల అమెరికా తో పాటు బహమాస్, ఇతర దేశాలపై ఈ అంతరిక్ష నౌక శకలాలు పడ్డాయి. గాల్లో దూసుకొస్తున్న ఈ శకలాలతో విమానాల రాకపోకలు నిలిపేయాల్సిన పరిస్ధితి ఎదురైంది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న కొన్ని ప్రాంతాలలో ఎఫ్ఏఏ వైమానిక రాకపోకలను నిలిపివేసింది. ఈ సంవత్సరం ఎలాన్ మస్క్.. మార్స్ రాకెట్ కార్యక్రమానికి ఇది రెండో వరుస వైఫల్యం. దక్షిణ ఫ్లోరిడా, బహామాస్ సమీపంలో సాయంత్రం ఆకాశం గుండా మండుతున్న శిధిలాలు దూసుకొస్తున్న దృశ్యాలు కనిపించడంతో స్ధానికులు వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు.
వాస్తవానికి స్పేస్ ఎక్స్ ష్టార్ షిప్ ఇంజిన్లు నిలిపివేయబడి అనియంత్రితంగా తిరగడం ప్రారంభించిన కొద్దిసేపటికే స్టార్‌షిప్ అంతరిక్షంలో విడిపోయిందని స్పేస్‌ఎక్స్ మిషన్ ప్రత్యక్ష ప్రసారంలో కనిపించింది. గతంలో స్పేస్ ఎక్స్ చేసిన ప్రయోగం కూడా విఫలం కావడంతో ఈసారి జాగ్రత్తలు తీసుకుంటారని అంతా భావించారు. కానీ ఈసారి ప్రయోగం కూడా విఫలం కావడం మస్క్ సంస్థ సమర్థతపై సందేహాలు లేవనెత్తుతోంది. స్పేస్‌ఎక్స్ గతంలో చేసిన ప్రయోగాల్లో ప్రారంభ మిషన్ దశల్లో వరుసగా ప్రమాదాలు సంభవించాయి. ఈ సంవత్సరం మస్క్ వేగంగా పూర్తి చేయాలని భావించిన కార్యక్రమానికి ఇది గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.