ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌లపై అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని సినీ నటుడు పోసాని కృష్ణ మురళి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం, విజయవాడలోని సూర్యారావుపేట, కర్నూలు, అదోని టూటౌన్ పోలీసులు వేర్వేరుగా నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని పిటిషన్లలో కోరారు.
ఈ కేసులలో పోలీసులు తదుపరి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కూడా పోసాని కృష్ణ మురళి హైకోర్టును అభ్యర్థించారు. పోలీసులు తనపై నమోదు చేసిన సెక్షన్లు వర్తించవని… రెండు సముహాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా తాను వ్యాఖ్యలు చేయలేదని పోసాని తన పిటిషన్లలో పేర్కొన్నారు. తనను తప్పుడు కేసులలో ఇరికించారని ఆరోపించారు.
ఈ నాలుగు కేసులలో సెక్షన్లు అన్ని ఏడేళ్లలోపు జైలుశిక్షకు సరిపడేవే అని… అందువల్ల ముందుగా నోటీసు ఇచ్చి పోలీసులు వివరణ తీసుకోసునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పోసాని క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. అయితే తనపై నమోదైన కేసులు కొట్టివేయాలన్న పోసాని పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఆదోని పోలీసులు నమోదు చేసిన కేసులో ఇప్పటికే.. పీటీ వారెంట్ అమలు అయినందున పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.