Jammu & Kashmir: భారీ ఎన్కౌంటర్.. నలుగురు ఉగ్రవాదులు హతం
Jammu & Kashmir: జమ్ముకాశ్మీర్‌లోని కుప్వారాలో శుక్రవారం ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో భారత్‌లోకి చొరబడేందుకు యత్నించిన నలుగురు ఉగ్రవాదులు మరణించినట్లు అధికారులు తెలిపారు.
కుప్వారాలోని మచల్ సెక్టార్ లో గల నియంత్రణరేఖ (ఎల్‌ఒసి) సమీపంలో పోలీసులు, ఆర్మీ అధికారులు శుక్రవారం సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్ లో నియంత్రణ రేఖ గుండా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ నుండి భారత్‌లోకి చొరబడేందుకు యత్నిస్తున్న నలుగురు ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది గుర్తించారు. వారిపై జరిపిన కాల్పుల్లో ఆ నలుగురు మృతిచెందినట్లు కాశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు.
ఒక వారంలో రెండో అతిపెద్ద చొరబాటును భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. జూన్ 16న కుప్వారా జిల్లాలోని జుమాగుండ్ ప్రాంతంలో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు పాకిస్థాన్ ఉగ్రవాదులు హతమయ్యారు.ఇదిలా ఉంటే, అనంత్‌నాగ్ పోలీసులు జమ్ముకశ్మీర్‌లోని బిజ్‌భేరా ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున ఇద్దరు లష్కరే తోయిబా (ఎల్ఈటీ) సానుభూతి పరులను అరెస్టు చేశారు.ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
అలాగే ఈ నెల 13న కూడా కుప్వారాలో ఎల్ఓసీ వద్ద జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. జిల్లాలోని డోబనార్ మచ్చల్ ప్రాంతంలో పోలీసులు, భద్రతా దళాలు ఉమ్మడిగా గాలింపు చేపట్టాయి. ఈ సందర్భంగా జరిగిన ఎన్‌కౌందర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించినట్లు పోలీసులు తెలిపారు.