Masab Tank : వద్ద ఆయిల్ ట్యాంకర్ బోల్తా
Masab Tank :హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్ వద్ద పెను ప్రమాదం తప్పింది.
మాసబ్‌ట్యాంక్ ఎన్ఎండీసీ వద్ద ఓ ఆయిల్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తాపడింది. ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడిన సంఘటనలో ఆయిల్ మొత్తం నేలపాలయింది.
స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం మెహదీపట్నం నుంచి మాసబ్ట్యాంక్కి ఓ ట్యాంకర్ క్రూడ్ ఆయిల్‌తో వస్తోంది. ఈ క్రమంలో మహవీర్ ఆసుపత్రి దగ్గరకు రాగానే బోల్తా పడింది.దీంతో అందులోని ఆయిల్ మొత్తం రోడ్డుపై పారింది.
దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి లక్డీకాపూల్ మాసబ్‌ట్యాంక్ ఏరియాల్లో ట్రాఫిక్ స్తంభించింది. అధికారులు స్పందించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.
అయితే ఈ పరిణామంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి మోహదీపట్నం, లక్డీకాపూల్, మాసబ్‌ట్యాంక్, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
అయితే ట్రాఫిక్ పోలీసులు క్రేన్ సాయంతో వాహనాలను రోడ్డు మీద నుంచి పక్కకు తీశారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఆయిల్ రోడ్డుపై పారడటంతో అటువైపుగా వెళ్తున్న కొందరు వాహనదారులు జారి కిందపడుతున్న ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి.
ఉదయం పూట ట్రాఫిక్ జామ్‌తో ఆ మార్గం మీదుగా ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ జామ్‌తో పలువురు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల గుండా ఆలస్యం కాకుండా ఆఫీసుకు చేరుకునే ప్రయత్నాలు చేశారు.
ఆయిల్ స్పిల్ ఘటనపై స్పందించిన ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ సిబ్బంది సమన్వయంతో ట్రాఫిక్ గందరగోళాన్ని సమర్ధవంతంగా పరిష్కరించేందుకు కృషి చేశారు. చమురు మరింత వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి ప్రభావిత రహదారి విభాగంలో కార్మికులు మట్టిని వేశారు.
మాసాబ్ ట్యాంక్, మెహిదీపట్నంలలో ట్రాఫిక్ రద్దీ యొక్క తీవ్రత దృష్ట్యా, ఈ ప్రాంతాలకు వెళ్లాలనుకునే ప్రయాణికులు కొనసాగుతున్న గందరగోళంలో చిక్కుకోకుండా ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు అధికారులు కసరత్తు చేస్తున్న తరుణంలో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదు.