ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశంలోని హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై ఆ దేశ ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ ముందు ప్రస్తావించారు. ఇరుదేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను దెబ్బతీసే ఘటనలను సహించకూడదని ప్రధాని స్పష్టం చేశారు. సిడ్నీలో జరిగిన ద్వైపాక్షిక చర్చల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ ఆస్ట్రేలియాలోని దేవాలయాలపై ఇటీవలి దాడులు, వేర్పాటువాద శక్తుల కార్యకలాపాలపై చర్చించారు. అయితే గతంలోనూ ఈ విషయంపై ఆసీస్ ప్రధానితో తాను చర్చించిన విషయాన్ని నరేంద్ర మోదీ గుర్తు చేశారు. అలాంటి ఘటనలకు పాల్పడేవారిపై చర్యలు తీసుకున్నందుకు ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ద్వైపాక్షిక సమావేశం తర్వాత సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య సంబంధాలకు విఘాతం కలిగించే అంశాలను సహించబోమని అన్నారు. భవిష్యత్తులో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆస్ట్రేలియా పీఎం ఆల్బనీస్ తనకు హామీ ఇచ్చారని కూడా ఆయన చెప్పారు. గత కొన్ని నెలలుగా ఆస్ట్రేలియాలోని దేవాలయాలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఇరువురు నేతలు ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ ఏడాది ప్రారంభంలో సంఘ విద్రోహ శక్తులు, వేర్పాటువాద ఖలిస్తానీ ఉద్యమాల మద్దతుదారులు ఆస్ట్రేలియాలోని హిందూ దేవాలయాలు, ఇతర ప్రార్థనా మందిరాలను ధ్వంసం చేశారు. సోమవారం మూడు రోజుల పర్యటన నిమిత్తం సిడ్నీకి చేరుకున్న ప్రధాని మోడీ అక్కడ G7 శిఖరాగ్ర సమావేశానికి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ప్రధాని మోదీ సిడ్నీలో దిగగానే, నగరంలోని భారతీయ సమాజం ఆయనకు ఘనస్వాగతం పలికింది. ప్రధాన మంత్రి ఆస్ట్రేలియన్ అగ్రశ్రేణి వ్యాపార నాయకులను కలుసుకున్నారు. ప్రధాని మోదీ ఆస్ట్రేలియా పీఎం ఆల్బనీస్‌తో కలిసి ఖుడోస్ బ్యాంక్ అరేనాలో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. త్వరలో బ్రిస్బేన్‌లో కొత్త భారత కాన్సులేట్‌ను ప్రారంభించనున్నట్లు ఆయన ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీని ‘బాస్’గా అభివర్ణించారు. 2014లో రాజీవ్ గాంధీ తర్వాత ఆస్ట్రేలియాలో పర్యటించిన తొలి భారత ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించారు.ఒలింపిక్ పార్క్ లోని సిడ్నీ సూపర్ డోమ్ లో 20,000 మందిని ఉద్దేశించి ప్రసంగించారు.