Telangana: తెలంగాణలో తన చితి తానే పేర్చుకుని వృద్ధుడి ఆత్మహత్య
Telangana: ఆ పెద్దయనకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్న కుటుంబాన్ని ఇన్నాళ్లు ఒంటిచేత్తో లాగి ఇప్పుడా కుటుంబానికి భారం అయ్యాడు. తన పోషణను కొడుకులు వంతులు వేసుకోవడం భరించలేకపోయాడు. తన చితి తానే పేర్చుకుని ఆత్మాహుతి చేసుకున్నారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలో జరిగింది.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలో గ్రామానికి చెందిన మెడబోయిన వెంకటయ్య(90)కు ఐదుగురు సంతానం. నలుగురు కుమారులు కనకయ్య, పోచయ్య, ఉమ్మయ్య, ఆరయ్య, ఒక కుమార్తె ఉన్నారు. కుమారులు పొట్లపల్లి, హుస్నాబాద్, కరీంనగర్ జిల్లా నవాబుపేటలో నివాసం ఉంటున్నారు. వెంకటయ్య భార్య గతంలోనే తనువు చాలించింది. అయితే తనకున్న 4 ఎకరాల భూమిని కుమారులకు సమానంగా పంచేశారు వెంకటయ్య. ప్రభుత్వం ఇస్తున్న వృద్ధాప్య పింఛన్ పై కాలం వెళ్లదీస్తున్నారు. వెంకటయ్య పొట్లపల్లిలో ఉంటున్న పెద్ద కుమారుడు కనకయ్య వద్ద ఉండేవారు. అయితే తండ్రి పోషణపై పెద్ద మనుషుల పంచాయితీ పెట్టిన కుమారులు…. నెలకు ఒకరు చొప్పున వంతులవారీగా తండ్రి పోషణ పంచుకున్నారు.
ముందుగా పొట్లపల్లిలో పెద్ద కుమారుడు కనకయ్య వద్ద నెల రోజుల పాటు వెంకటయ్య ఉన్నారు. పెద్ద కుమారుడి వద్ద వంతు పూర్తి కావడంతో నవాబుపేటలో ఉంటున్న మరో కుమారుడి వద్దకు వెళ్లాల్సిఉంది. అయితే 90 ఏళ్ల వయసులో పోషణ కోసం కుమారులు వంతులు వేసుకోవడం చూసి ఆ గుండె తట్టుకోలేకపోయింది. ఉన్న ఊరిని, ఇన్నాళ్లు తిరుగాడిన ఇంటిని వదిలి వెళ్లనని వెంకటయ్య తరచూ చెప్పేవారు.
అయితే ఈ నెల 2వ తేదీ సాయంత్రి ఇంటి నుంచి బయటకు వచ్చిన వెంకటయ్య గ్రామంలో తనకు తెలిసిన వాళ్ల దగ్గర తన ఆవేదన చెప్పుకున్నారు. బుధవారం ఉదయం నవాబుపేటలోని తన కుమారుడి ఇంటికి వెళ్తున్నానని చెప్పి గ్రామం నుంచి వెళ్లిపోయారు వెంకటయ్య. అయితే ఏ కుమారుడి ఇంటికి వెళ్లని ఆ వృద్ధుడు గురువారం మధ్యాహ్నం పొట్లపల్లిలోని ఎల్లమ్మగుట్ట వద్ద మంటల్లో కాలిపోయిన స్థితిలో వెంకటయ్య మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. తాటికమ్మలను చితిగా పేర్చుకుని వాటికి నిప్పుపెట్టి వెంకటయ్య ఆత్మాహుతికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. చితిలో కాలిపోయిన మృతదేహం వెంకటయ్యదేనని కుటుంబ సభ్యులు గుర్తించారు. హుటాహుటిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వృద్ధుడు చితికి నిప్పు పెట్టుకున్న ప్రాంతాన్ని పరిశీలించారు. తనకు తానే చితి పేర్చుకుని నిప్పంటించి అందులో దూకి ఆత్మాహుతి చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, వెంకటయ్య ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ మణెమ్మ తెలిపారు.