Viveka Murder Case: రేపు సీబీఐ కోర్టులో లొంగిపోనున్న ఎర్ర గంగిరెడ్డి
Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు A1 గా ఎర్ర గంగిరెడ్డి ఈ నెల 5వ తేదీన సీబీఐ కోర్టులో లొంగిపోనున్నారు. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ ను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. మే 5వ తేదీ లోపుగా ఎర్ర గంగిరెడ్డి సీబీఐ కోర్టులో లొంగిపోవాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. దీంతో రేపు కోర్టులో లొంగిపోతానని ఎర్ర గంగిరెడ్డి మీడియాకు చెప్పారు.
2019 ఫిబ్రవరి 10న.. సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి, దస్తగిరిని ఇంటికి పిలిపించిన ఎర్ర గంగిరెడ్డి వివేకా హత్య ప్రణాళిక గురించి చెప్పినట్లు సీబీఐ తెలిపింది. అలాగే 2019 మార్చి 28న అప్పటి ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఎర్ర గంగిరెడ్డిని అరెస్ట్ చేసింది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక కొత్తగా ఏర్పాటు చేసిన సిట్ సకాలంలో ఛార్జిషీట్ దాఖలు చేయకపోవడంతో ఎర్ర గంగిరెడ్డికి 2019 జూన్ 27న పులివెందుల కోర్టు డీఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం వివేకా హత్య కేసు దర్యాప్తు వేగవంతం చేసిన సీబీఐ ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసింది. సాక్షులను ప్రభావితం చేస్తున్నారని తెలిపింది. సీబీఐవాదనలు పరిగణలోకి తీసుకున్న తెలంగాణ హైకోర్టు.. గంగిరెడ్డి బెయిల్‌ను రద్దు చేస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
2021 అక్టోబర్ 26న పులివెందుల కోర్ట్‌లో మొదటి ఛార్జ్‌షీట్ వేసిన సీబీఐ ఎర్రగంగిరెడ్డిని A1 నిందితుడిగా చేర్చింది. బెంగళూరు స్థలం సెటిల్మెంట్ డబ్బులో వివేకా తనకు వాటా ఇవ్వలేదంటూ హత్యకు పురమాయించినట్లు పేర్కొంది. వివేకాను హత్య చేస్తే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి 40 కోట్ల రూపాయలు సుపారీ ఇస్తారని ఎర్రగంగిరెడ్డి నమ్మబలికారని వివరించింది. దీని వెనుక భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, మనోహర్ రెడ్డి ఉన్నట్లు ఎర్రగంగిరెడ్డే తనకు చెప్పారని కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి కూడా వాంగ్మూలం ఇచ్చారు.
అయితే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ఈ ఏడాది జూన్ 30వ తేదీ లోపుగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జూలై 1వ తేదీన ఎర్ర గంగిరెడ్డికి బెయిల్ ఇవ్వాలని సీబీఐ కోర్టును తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. దీనితో తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ ఏడాది జూన్ 30వ వరకు ఎర్ర గంగిరెడ్డి జైల్లో ఉండనున్నారు. కానీ ఎర్ర గంగిరెడ్డి రేపు సీబీఐ కోర్టులోలొంగిపోనున్నారు.