ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ వైసీపీ పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు. వైసీపీ రీజినల్ కో- ఆర్డినేటర్ పదవికి బాలినేని రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ కార్యాలయానికి పంపించినట్లు తెలుస్తోంది. మంత్రి పదవి నుంచి బాలినేనిని తప్పించిన జగన్ ఆయనను ప్రస్తుతం చిత్తూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల వైసీపీ సమన్వయ కర్తగా నియమించారు. అయితే తమ జిల్లాకే చెందిన ఆదిమూలపు సురేశ్ ను కేబినెట్ లో కొనసాగిస్తూ తనను తప్పించడాన్ని ఆయన అవమానంగా భావించారు దీనిపై బాలినేని ఆగ్రహంతో ఉన్నారు. అలాగే తనకు వ్యతిరేకంగా పార్టీలో కొంతమంది పనిచేస్తున్నారని బహిరంగంగానే వ్యాఖ్యానించారు. అయితే పార్టీలో తనకు ప్రాధాన్యం తగ్గుతున్నట్టుగా ఆయన భావించారు. ఇటీవల మార్కాపురంలో సీఎం జగన్ మోహన్‌రెడ్డి సభ వద్ద పోలీసులు తనను అడ్డుకోవడంపై బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు ముఖ్యమంత్రి స్వయంగా ఫోన్ చేస్తే తప్ప బాలినేని వేదికపైకి రాలేదు. ప్రోటోకాల్ ఇష్యూ నుంచి పార్టీ అధిష్టానంపై బాలినేని గుర్రుగా ఉన్నారు.ఈ పరిణామాల నేపథ్యంలో బాలినేని రాజీనామా నిర్ణయం తీసుకున్నారు.
అసలు బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు బంధువనే సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నుంచి జగన్‌తో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో మంత్రి పదవిని కూడా త్యాగం చేసి జగన్ పార్టీలో చేరారు. ఒంగోలులో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ తరుపున మొదటి సారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటి నుంచి జగన్ వెంటే ఉంటూ వచ్చారు 2019లో వైసీపీ అధికారంలో వచ్చాక జగన్ తన మంత్రివర్గంలోకి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని తీసుకున్నారు. అయితే ఆ తర్వాత మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణలో.. బాలినేనిని మంత్రి పదవి నుంచి తొలగించారు. అయితే బాలినేని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయగా.. స్వయంగా జగన్ రంగంలోకి దిగి ఆయనను బుజ్జగించారు.
పార్టీలో సీనియర్ నాయకుడైన బాలినేని శ్రీనివాస్ రెడ్డి వ్యవహారంపై వైసీపీ అధిష్టానం ఏవిధంగా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. తొలిసారిగా తన అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తపరిచారు బాలినేని. ప్రకాశం జిల్లాలో కీలక నాయకుడిగా ఉన్న బాలినేనిని వైసీపీ అధిష్టానం అంత సులువుగా వదులుకోదని, ఆయనను బుజ్జగించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బాలినేని నిర్ణయం ప్రకాశం జిల్లా లో వైసీపీ పార్టీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని అంటున్నారు.