తెలంగాణ రైతులకు శుభవార్త. యాసంగి మొక్కజొన్నల కొనుగోలుకు సంబంధించి సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. యాసంగిలో పండిన మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మక్కలను కొనాలని అధికారులను ఆదేశించారు.
కాగా రైతులకు భరోసా ఇచ్చేందుకు సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారని వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. అకాల వర్షాలతో మక్కలు తడిసి ఇబ్బంది పడుతున్న రైతులు సీఎం నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6.50 లక్షల ఎకరాలలో మొక్కజొన్న సాగు అయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ద్వారా 17.37 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని చెబుతున్నారు. అయితే మొక్కజొన్న క్వింటాలకు ప్రభుత్వం మద్దతు ధర రూ. 1962 గా నిర్ణయించారు. ప్రధానంగా మొక్కజొన్నను ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలలో సాగుచేశారు. అయితే ఇటీవల అకాల వర్షాలకు పలు జిల్లాలలో మొక్కజొన్న పంట కొంత దెబ్బతిన్న తరుణంలో ప్రభుత్వం కొనుగోలుకు నిర్ణయం తీసుకోవడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలావుంటే ఇటీవల కురుస్తున్న అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల్లో ఎక్కువమంది వరి, మొక్కజొన్న రైతులే. అయితే ఇప్పటికే వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుండగా ఇప్పుడు రైతుల అండగా వుండేందుకు మొక్కజొన్న కొనుగోలుకు కూడా ప్రభుత్వం ముందుకు వచ్చింది.
ఇటీవల వర్షాలకు తెలంగాణ వ్యాప్తంగా 4.5 లక్షల ఎకరాల్లో పలు రకాల పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. బుధవారం ఉదయం నుండి వ్యవసాయ శాఖాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టంపై అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి పంపారు. రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో పెద్ద ఎత్తున పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయ ప్రాథమిక అంచనా తెలుపుతుంది. ఉమ్మడి మెదక్, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో భారీగా పంట నష్టమైందని వ్యవసాయ శాఖ నివేదిక తేల్చింది. వరి, మామిడి, మొక్కజొన్న, కూరగాయలు పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయ శాఖ నివేదిక తేల్చింది.