ఈ నెల 29న కాశీ తెలుగు సంగమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు.
PM Modi: పుష్కర కాలానికి ఒకసారి వచ్చే అతిపెద్ద పండుగకు గంగానది సిద్ధమవుతున్నది. బృహస్పతి మేషరాశిలో ప్రవేశించినప్పుడు (మేష రాశిలో గురు సంక్రమణం) గంగా పుష్కరాలు ప్రారంభమవుతాయి. 12 ఏండ్ల తర్వాత నేటి నుంచి గంగా నదికి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. పుష్కరాల సమయంలో ఆయా నదుల్లో స్నానమాచరిస్తే సకల పాపాల నుంచి విముక్తమవుతామని ప్రతీతి. ఈ సమయంలో బ్రహ్మాది దేవతలంతా పుష్కరునితో సహా నదీజలాల్లో ప్రవేశిస్తారని చెప్తారు. గంగానది పుట్టింది మొదలు సముద్రంలో కలిసే దాకా ప్రతీది భారతీయులకు పవిత్రం. గంగా ఒడ్డున ఎన్నో నాగరికతలు పుట్టాయి. మరెన్నో సామ్రాజ్యాలు వెలిశాయి గంగానదికి చాలా పేర్లున్నాయి. భగీరథ ప్రయత్నం వల్ల వచ్చింది కాబట్టి భాగీరథి అంటారు. జహ్ను పొట్టలోంచి పుట్టింది కాబట్టి జాహ్నవిగా కూడా పిలుస్తారు. భారతీయులు ఒక్కసారైనా మునిగి తీరాలనుకునే గంగా ప్రధానమైనది. కాశీనాథుడు కొలువుదీరిన పవిత్ర వారణాసి క్షేత్రంలో గంగాపుష్కర స్నానానికి 64 స్నాన ఘాట్లు ఉన్నాయి. అన్నింటిలోకి మణికర్ణిక ఘాట్ ముఖ్యమైనది. బృహస్పతి మీనరాశిలో ప్రవేశించినప్పడు అంటే 2023, మే 3న గంగానది పుష్కరాలు ముగుస్తాయి.
ఈ సందర్బంగా ఈ నెల 29న తన పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలో జరిగే కాశీ తెలుగు సంగమం కార్యక్రమంలో PM Modi వర్చువల్గా ప్రసంగించనున్నారు. పన్నెండేళ్ల తర్వాత జరుగుతున్న 12 రోజుల గంగా పుష్కరాల సందర్భంగా తెలుగు మాట్లాడే యాత్రికులు పెద్ద సంఖ్యలో వారణాసికి వస్తున్న తరుణంలో ఈ కార్యక్రమం జరగనుంది.
తెలుగువారితో ముడిపడి ఉన్న ఆశ్రమాలు, ధర్మశాలల సంస్థ శ్రీ కాశీ తెలుగు సమితి ‘సంగమం’ నిర్వహిస్తోందని ఆ సంస్థ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆయనే సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. గంగా నది మానస సరోవర్ ఘాట్ వద్ద జరిగే ఈ ఒక్కరోజు కార్యక్రమంలో పవిత్ర నగరానికి, ఆంధ్రప్రదేశ్ కు మధ్య ఉన్న ప్రాచీన నాగరిక సంబంధాలను హైలైట్ చేయనున్నారు.
తెలుగు మాట్లాడే ప్రజలు నివసిస్తున్న రెండు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ అనుబంధాన్ని పురస్కరించుకుని పలు సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలను నిర్వహించనున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో అధికార బీజేపీ మూలాలను మరింత బలోపేతం చేసేందుకు PM Modi చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ఈ కసరత్తు జరుగుతోంది.
నెల రోజుల పాటు జరిగే కాశీ తమిళ సంగమానికి వారణాసి ఆతిథ్యమిచ్చింది. గంగా పుష్కరాల సందర్భంగా గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరించడానికి, వివిధ ఆచారాల్లో పాల్గొనేందుకు లక్షలాది మంది తరలివస్తున్నారు. ఇది చాలా పవిత్రమైన కాలం. ఇలాంటి వేలాది మంది యాత్రికులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారని, రెండు ప్రాంతాల మధ్య ఉన్న ప్రాచీన నాగరిక సంబంధాన్ని మోదీ హైలైట్ చేస్తారని రావు తెలిపారు. వారణాసి మత, సాంస్కృతిక వారసత్వాన్ని పునరుజ్జీవింపజేసినందుకు ప్రధానిని ఆయన ప్రశంసించారు. వారణాసిలో నెల రోజుల పాటు కాశీ తమిళ సంగమం కూడా నిర్వహించారు.