కేసీఆర్పై బ్రిటిష్ ఎంపీ వీరేంద్రశర్మ ప్రశంసల వెల్లువ
KCR: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున ఆవిష్కరించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఆకాశాన్ని తాకేలా, సమసమాజానికి స్ఫూర్తి నింపేలా బాబాసాహెబ్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయించిన సీఎం కేసీఆర్పై ప్రశంసల వర్షం కురుస్తున్నది. 125 అడుగుల ఎత్తయిన కాంస్య విగ్రహాన్ని నిర్మించినందుకు తెలంగాణ సమాజం జేజేలు పలుకుతున్నది.
మరొక వైపు ముఖ్యమంత్రి KCR సామాజిక సమానత్వ దార్శనికత దేశ విదేశాల మేధావులు, సీనియర్ రాజకీయ వేత్తల ప్రశంసలు అందుకొంటున్నది. భారతదేశం గర్వించే రీతిలో డాక్టర్ బీఆర్ అంబేదర్ 125 అడుగుల మహా విగ్రహాన్ని ఇటీవలే హైదరాబాద్ నడిబొడ్డున ఆవిషరించటంపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ మహా విగ్రహావిష్కరణ ప్రాధాన్యం సంతరించుకొంటున్నది. తాజాగా సీఎం కేసీఆర్ మహోన్నత దార్శనికతను కొనియాడుతూ బ్రిటన్ పార్లమెంటు సభ్యుడు (ఎంపీ) వీరేంద్ర శర్మ స్వయంగా లేఖ రాశారు. యూకేలోని సౌతాల్లో ఉన్న ఈలింగ్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఆయన ఎంపీగా ఉన్నారు. బ్రిటిష్ ఇండియన్ సంతతికి చెందిన 76 ఏండ్ల సీనియర్ రాజకీయ నాయకుడు వీరేంద్ర శర్మ ఈ మెయిల్ ద్వారా సీఎం KCR కు అభినందనలు తెలుపుతూ లేఖ రాశారు.
డాక్టర్ బీఆర్ అంబేదర్ మహా విగ్రహాన్ని నిర్మించి ఆవిషరించడం గొప్ప విషయం. ఇది తెలంగాణ రాష్ట్రానికి, మీకు కూడా గర్వకారణం. మీ స్ఫూర్తి అద్భుతం డాక్టర్ అంబేదర్ పుట్టుక, వారు చేసిన కృషి, వారి చరిత్రే భారతదేశ చరిత్ర. ఇటు యూకే, అటు ఇండియాలోనూ నాటి పరిస్థితుల్లో అంబేదర్ ప్రదర్శించిన సహనం, సమానత్వం కోసం పట్టుదల, ఆలోచనలు, కార్యాచరణ, విరామమెరుగని రచనా వ్యాసంగం మహోన్నతమైనవి. కాలం చెల్లిన సంప్రదాయ మూస ధోరణులను పక్కకు తోసి, ఎటువంటి వివక్షకు తావులేకుండా అన్ని వర్గాల సమానత్వంతో కూడిన సమ్మిళితాభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ, బహుళత్వం దిశగా సమాజాన్ని నడిపించేందుకు నవీన భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బీఆర్ అంబేదర్ రూపొందించించారు. రాజ్యాంగ నిర్మాతగా, పితామహుడుగా భారతదేశ పురోగమనానికి కొనసాగింపుగానే వారు రాజ్యాంగ్యాన్ని నిర్మించారు. భవిష్యత్తు తరాల కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేదర్ ప్రదర్శించిన దార్శనికతను మనం ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నాం. యూకేలోని తెలంగాణకు చెందిన సామాజిక సంస్థలతో కలిసి పనిచేయడం గర్వంగా భావిస్తున్నాను. త్వరలో మిమ్మల్ని బ్రిటన్లో కలిసేందుకు ఎదురుచూస్తున్నాను. అంబేద్కర్ విగ్రహం తయారీ, నేపథ్యం, ఆవిష్కరణపై మీ అనుభవసారాన్ని తెలుసుకోవాలని ఆశిస్తున్నాను.