corona virus:దేశంలో కొత్తగా 3,641 కోవిడ్ -19 కేసులు, 11 మరణాలు
కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడమే కాకుండా దాదాపుగా జీరోకు చేరిందని ఊపిరి పీల్చుకునేలోగా ఇప్పుడు మరోసారి ఈ మహమ్మారి కోరలు చాచేందుకు సిద్ధమౌతోంది. గత కొద్దిరోజుల్నించి కరోనా వైరస్ కేసుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది.
ఇప్పుడు తాజాగా దేశంలో గడిచిన 24 గంటల్లో దేశంలో 3,641 కొత్త కోవిడ్ -19 కేసులు, 11 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. దీంతో దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 20,219కి చేరుకోగా, ఇది 0.05 శాతంగా ఉంది. మొత్తం మరణాల సంఖ్య 5,30,892కి చేరింది. మహారాష్ట్రలో ముగ్గురు, ఢిల్లీ, కేరళ, కర్ణాటక, రాజస్థాన్లలో ఒక్కొక్కరు చొప్పున 24 గంటల వ్యవధిలో మరణించారు.
ఈ మరణాల్లో కేరళకు చెందిన నాలుగు మరణాలు కూడా ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. తాజా గణాంకాల ప్రకారం రోజువారీ పాజిటివిటీ 6.12 శాతం, వీక్లీ పాజిటివిటీ 2.45 శాతంగా నమోదైంది. గత 24 గంటల్లో 1,800 మంది రోగులు వ్యాధి నుండి కోలుకున్నారు, 2020 లో మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి దేశంలో మొత్తం రికవరీల సంఖ్య 4,41,75,135 కు చేరుకుంది.
సాధారణ ప్రజానీకానికి కోవిడ్ బూస్టర్ డోసులను సిఫారసు చేయడం లేదని టీకాల వల్ల ప్రయోజనం పరిమితంగానే ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇప్పటికే వ్యాక్సిన్లు వేయించుకొని బూస్టర్ డోస్ కూడా తీసుకున్న వారికి మరో డోస్ తీసుకున్నప్పటికీ ఎలాంటి రిస్క్ లేదని కానీ ఫలితం తక్కువగానే ఉంటుందని డబ్ల్యూహెచ్వో టీకా నిపుణులు తెలిపారు.
ఇప్పటివరకు 92.18 కోట్ల కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 59,512 పరీక్షలు నిర్వహించినట్లు మంత్రిత్వ శాఖ వెబ్సైట్ తెలిపింది, దేశవ్యాప్తంగా కోవిడ్ -19 వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు దేశంలో 220.65 కోట్ల డోసుల కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వబడింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 59,512 కోవిడ్-19 పరీక్షలు నిర్వహించగా.. భారత్లో ఇప్పటివరకు 92.18 కోట్లకు పైగా కరోనా పరీక్షలు నిర్వహించారు.