టాలీవుడ్ నటుడు కమ్ ప్రొడ్యూసర్ కాస్ట్యూమ్స్ కృష్ణ ఈ రోజు (ఏప్రిల్ 2న) చెన్నైలో కన్నుమూశారు. ఈ వార్తతో యావత్ టాలీవుడ్ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోగా, కాస్ట్యూమ్స్ కృష్ణ కుటుంబానికి ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. కృష్ణ మరణవార్త యావత్ తెలుగు చిత్ర పరిశ్రమను శోకసంద్రంలో ముంచింది. పలువురు నటులు, దర్శకనిర్మాతలు సోషల్ మీడియా వేదికగా తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఆయన విలక్షణ నటనా శైలి, అచంచలమైన డైలాగ్ డెలివరీ, తెలుగు సినిమాకు ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.
కాగా ఆంధ్రప్రదేశ్ విజయనగరం కు చెందిన ఆయన పూర్తి పేరు మాదాసు కృష్ణ. తెలుగులో అనేక సినిమాలకు ఆయన కాస్ట్యూమ్స్ అందించారు. డ్రెస్ డిజైనింగ్ నుంచి కాస్ట్యూమ్స్ వరకు అన్నీ ఆయనే సమకూర్చేవారు దాంతో ఆయనను కాస్ట్యూమ్స్ కృష్ణ గా ఆయన పేరు స్థిరపడింది. కాస్ట్యూమ్స్ కృష్ణ సురేష్ ప్రొడక్షన్స్‌లో ఎన్నో సినిమాలకు ఆయన పని చేయడంతో అప్పట్లో అందరూ ఆయన్ను ‘సురేష్’ కృష్ణ అని పిలిచేవారు. తరువాత తరువాత ఆయన ఎన్నో ఇతర ప్రొడక్షన్లో సినిమాలకు కాస్టూమ్స్ అందించడంతో ఆయనను ఇంకా కాస్ట్యూమ్స్ కృష్ణ అని అనేవారు.
సినిమాల మీద ఆసక్తితో కృష్ణ 1954లోనే విజయనగరం నుండి మద్రాసు వెళ్లి అక్కడ అసిస్టెంట్ కాస్ట్యూమర్ గా తన కెరీర్ మొదలు పెట్టారు. అతి తక్కువ కాలంలోనే కాస్ట్యూమర్ గా మంచి పేరు తెచ్చుకున్న కృష్ణ రామానాయుడు సంస్థలో ఫుల్ టైం కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసేవారు. అలా రామానాయుడు సంస్థ ద్వారా ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి వంటి హీరోల మొదలు వాణిశ్రీ, జయసుధ, జయప్రద, శ్రీదేవి వంటి హీరోయిన్స్ వరకు చాలా మందికి కాస్ట్యూమ్స్ అందించి కాస్ట్యూమ్స్ కృష్ణ గా పేరు తెచ్చుకున్నారు.
ఆ తరువాత ఆయనలో నటుడు ఉన్నాడని గుర్తించిన కోడి రామకృష్ణ ఆయనకు నటుడిగా అవకాశం ఇచ్చారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన భారత్ బంద్ సినిమాతో కృష నటుడిగా మారారు. అక్కడ నుండి ‘పెళ్లాం చెబితే వినాలి’, ‘పోలీస్ లాకప్’, ‘అల్లరి మొగుడు’, ‘దేవుళ్లు’, ‘మా ఆయన బంగారం’, ‘విలన్’, ‘శాంభవి ఐపీఎస్’, ‘పుట్టింటికి రా చెల్లి’ తదితర చిత్రాల్లో తనదైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించారు కాస్టూమ్స్ కృష్ణ. ఆయన మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటని, ఆయనను తీవ్రంగా కోల్పోతామన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అన్నాడు కోరుకుంటున్నారు.