ఉగ్రవాదిని హతమార్చి ప్రతీకారం తీర్చుకున్న సైన్యం
జమ్మూ కశ్మీర్లో మంగళవారం ఉదయం సైన్యం, ఉగ్రవాదుల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో రెండు రోజుల కిందట కశ్మీర్ పండిట్‌పై కాల్పులకు పాల్పడిన ఉగ్రవాదిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. పుల్వామాలో కశ్మీర్ పండిట్ సంజయ్ శర్మను ఉగ్రమూకలు ఆదివారం ఉదయం హత్యచేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనకు కారకుడైన హిజ్బుల్ ముజాయిద్దీన్ ఉగ్రవాది అఖిబ్ ముస్తాఖ్ భట్‌ను సైన్యం ఎన్కౌంటర్లో కాల్చి చంపినట్టు కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. పుల్వామా జిల్లా అవంతిపొరలో ఇద్దరు ఉగ్రవాదులు నక్కినట్టు నిఘా వర్గాలు సమాచారం అందించాయి. దీంతో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీసులు, సైన్యం సంయుక్తంగా అక్కడకు చేరుకుని నిర్బంధ తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. అప్రమత్తమైన సైన్యం ఎదురుకాల్పులు జరపడంతో ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. సైన్యం కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడని, అతడు హిజ్బుల్ ముజాయిద్దీన్ సంస్థకు చెందిన ముస్తాఖ్ భట్‌గా గుర్తించినట్టు పేర్కొంది. ప్రస్తుతం ది రెసిస్టెంట్ ఫ్రంట్‌తో కలిసి పనిచేస్తున్నట్టు తెలిపింది. ‘‘హతమైన ఉగ్రవాదిని పుల్వామాకు చెందిన అఖిబ్ ముస్తాఖ్ భట్‌గా గుర్తించాం.. ప్రాథమికంగా అతడు హిజ్బుల్ ముజాయిద్దీన్ ఉగ్రవాద సంస్థ కోసం పనిచేస్తున్నాడు.. ప్రస్తుతం మాత్రం ది రెసిస్టెంట్ ఫ్రంట్‌తో కలిసి ఉగ్రవాద కార్యకలాపాలను కొనసాగిస్తున్నాడు’’ అని జమ్మూ కశ్మీర్ పోలీసులు ట్వీట్ చేశారు. మంగళవారం తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో ఈ ఎన్కౌంటర్ ప్రారంభమయ్యింది. కాగా, కశ్మీర్‌లోని మైనార్టీలపై ఉగ్రవాదులు నాలుగు నెలల తర్వాత మళ్లీ దాడికి పాల్పడ్డారు.
ఇది కూడా చదవండి :