టీటీడీ పదవిని తిరస్కరించిన చాగంటికోటేశ్వరరావు గారు

CHAGANTI KOTESWARA RAO REJECTS TTD DHARMIC

ప్రముఖ ప్రవచన కర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావును టీటీడీ ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా ఏపీ ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. ఈ పదవికి సంబంధించి రెండు రోజులలో  అధికారికంగా ఉత్వర్వులు రావాల్సి ఉంది. ఈ వార్తలు బయటికొచ్చిన తర్వాత కుటుంబ సమేతంగా తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీసుకు వెళ్లి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు చాగంటి గారు. అయితే నెల రోజుల తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియట్లేదు కానీ సడన్‌గా చాగంటి ఆ పదవిని తిరస్కరిస్తున్నట్లు ఓ ఇంటర్వ్యూ వేదికగా ప్రకటించారు. ఇందుకు సరైన కారణాలేంటనేది బయటికి రాలేదు కానీ టీటీడీకి సలహాలు ఇవ్వడానికి పదవులు అవసరం లేదని చెప్పుకొచ్చారు. తిరుమల వేంకటేశ్వరుడే తన ఊపిరని, ఆయన సేవ చేసుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని ఇందుకు పదవులు ఏమీ అక్కర్లేదని తెలిపారు. టీటీడీకి తన అవసరం ఎప్పుడొచ్చినా పరుగెత్తుకుంటూ వెళ్లి ముందుంటానని చెప్పి పదవిని తిరస్కరించారు జనవరి- 21న హెచ్‌డీపీపీ కార్యనిర్వాహక కమిటీ టీటీడీ ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా చాగంటిని నియమిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కమిటీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డే  మీడియా వేదికగా ప్రకటించారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం టీటీడీ మూడేళ్లుగా వివిధ పారాయణాలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు వీలుగా ఈ నియామకం చేపట్టినట్లు అప్పట్లో వైవీ మీడియా ముఖంగా చెప్పారు. గ్రామీణ యువత భాగస్వామ్యంతో మారుమూల గ్రామాల్లో హిందూ ధర్మప్రచార కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని ఈ సలహాదారు పదవిని ఇస్తున్నట్లు వైవీ తెలిపారు. ఆ తర్వాత సీఎం జగన్‌ను కలవడం అంతా బాగానే ఉందనుకున్న టైమ్‌లో చాగంటి ఇలా తిరస్కరించడంతో ఏదో పెద్ద కారణమే ఉంటుందని తెలుస్తోంది.  అయితే వాస్తవానికి జగన్ సర్కార్‌లో వందలాది సలహాదారులు ఉన్నారు. ఈ సలహాదారుల విధానంపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అసలు ఈ సలహాదారులు అనేవారు ఏం చేస్తారు.  సలహాదారులకు జవాబుదారీతనం, బాధ్యత ఏముంటుంది.  అసలు వారికి నియమ నిబంధనలు, ఎలాంటి ప్రవర్తనా నియమావళి లేదు అని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు కూడా చేసింది. అంతేకాదు సలహాదారుల ద్వారా ప్రభుత్వ సున్నిత సమాచారం కూడా బయటకు వెళ్లే ప్రమాదం ఉందంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది.

రోడ్డుపై వెళ్లే వ్యక్తిని రాత్రికిరాత్రే సలహాదారుగా నియమించడానికి వీల్లేదని, సలహాదారుల నియామకంపై మార్గదర్శకాలు జారీ చేయబోమని హైకోర్టు కోర్టు వెల్లడించింది. వారికి సంబంధించి రాజ్యాంగబద్ధతను మాత్రమే తేలుస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. ఇప్పుడింకా ఈ సలహాదారుల వ్యవహారం ఏపీ హైకోర్టులో విచారణ జరుగుతూనే ఉంది. సలహాదారుల వ్యవహారంలో ఎప్పుడైనా కోర్టు నుంచి జగన్ సర్కార్‌కు  ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అప్పుడు తాను కూడా వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి తప్పకుండా వస్తుందని ముందే గ్రహించి చాగంటి ఇలా చేశారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి. అయితే ఆయన ఆశించిన రీతిలో టీటీడీలో విధి విధానాలు కూడా లేవని అందుకే చాగంటి తప్పుకున్నారనే ప్రచారమూ కూడా చక్కెరలు కొడుతుంది.  ఇందులో నిజానిజాలేంటో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ ఆసక్తిగా వేచి చూడాల్సిందే.

ఇది కూడా చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh