రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కీలక ప్రకటన : ఏపీలో మరిన్ని పెట్టుబడులు
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అన్ని రకాలుగా అవకాశాలు ఉన్నాయన్నారు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ. విశాఖలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ లో పాల్గొన్న ఆయన కీలక ప్రసంగం చేశారు. తెలుగులో నమస్కారం అంటూ ప్రసంగం ప్రారంభించిన ఆయన ఈ సదస్సులో పాల్గొనడం ఆనందంగా ఉంది అన్నారు. ఆంధ్రప్రదేశ్లో చాలా భూమి ఉందనీ. టాలెంట్ ఉన్న యువత ఉందనీ, సహజ వనరులు, బీచ్లూ ఉన్నాయని అన్నారు. అలాగే ఏపీలో కృష్ణ, గోదావరి నదులు, విశాఖ, తిరుమల లాంటి నగరాలు, విజయనగర సామ్రాజ్య చరిత్ర ఇలా ఎన్నో ఉన్నాయనీ ఇవన్నీ పారిశ్రామిక వేత్తలకు కలిసొచ్చే అంశాలని తెలిపారు.
ఏపీలో మౌలిక సదుపాయాలు, ఫార్మాస్యూటికల్స్ రంగాలు దూసుకెళ్తున్నాయన్న రిలయన్స్ అధినేత ప్రపంచంలో గొప్ప సైంటిస్టులు, డాక్టర్లు, వివిధ రంగాల్లో ఏపీ వాళ్లు ఉన్నారని చెప్పారు. రిలయన్స్ సంస్థలో కూడా చాలా మంది మేనేజర్లు, ప్రొఫెషనల్స్ ఏపీ వాళ్లు ఉన్నారని తెలిపారు. మెరైన్ రంగంలో ఏపీ బాగా అభివృద్ధి సాధించగలదని తెలిపిన ఆయన ప్రధాని మోది వల్ల దేశం ముందుకు దూసుకెళ్తోందనీ అలాగే సీ.యం జగన్ వల్ల ఏపీ ముందుకెళ్తోందని అన్నారు.
ఏపీ ఆర్థికాభివృద్ధిలో దూసుకెళ్తుందనే బలమైన నమ్మకం ఉందన్న రిలయన్స్ చీఫ్ 2002 నుంచి సహజ వాయువు రంగంలో రిలయన్స్ పెట్టుబడులు పెడుతోందనీ దేశంలో 30 శాతం గ్యాస్ ఉత్పత్తి ఏపీ నుంచే ఉందని ముఖేష్ అంబానీ తెలిపారు. జియో ద్వారా 4జీ టెక్నాలజీ ఏపీలో 98 శాతం కవర్ అయ్యిందన్న ఆయన 5జీ టెక్నాలజీ 2023 చివరి నాటికి ఏపీ సహా దేశమంతా విస్తరిస్తుందని తెలిపారు. ఏపీ ఎకానమీలో జియో 5జీ కొత్త డిజిటల్ రివల్యూషన్ తీసుకురాబోతోందని తెలిపారు. ఏపీలో జియో కోసం 40వేల కోట్ల పెట్టుబడులు పెట్టామన్న ఆయన ఈ పెట్టుబడులు, 5జీ టెక్నాలజీ రాకతో లార్జ్ స్కేల్ బిజినెస్, ఉద్యోగ అవకాశాలు భారీగా పెరగబోతున్నాయని వివరించారు. రిలయన్స్ రిటైల్ ఏపీలోని 6వేల గ్రామాలకు విస్తరించిందన్న ముఖేష్ అంబానీ 1లక్ష 29వేల కిరాణా షాప్స్ తో రిలయన్స్ రిటైల్ సంబంధాలు కొనసాగిస్తోందన్న ఆయన రిలయన్స్ రిటైల్ 20వేల ఉద్యోగాలు వేల సంఖ్యలో ఇండైరెక్ట్ జాబ్స్ ఇవ్వగలిగిందని తెలిపారు. రిలయన్స్ రిటైల్ సాయంతో అగ్రి, అగ్రి బేస్డ్ ప్రొడక్ట్స్, తయారీ పరికరాలు ప్రజలకు అందివ్వగలుగుతున్నామని వివరించారు. రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా విద్య ఆరోగ్యం, గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు వివరించారు.
ఏపీ అభివృద్ధిలో భాగస్వామిగా రిలయన్స్ కంటిన్యూ అవుతుందని తెలిపిన ముఖేష్ తమ సంస్థ తరపున పెట్టుబడులు కొనసాగుతూనే ఉంటాయని తెలిపారు. భవిష్యత్తులో ఏపీలో 10 గిగావాట్స్ రిన్యూవబుల్ సోలార్ ఎనర్జీ ప్లాంట్లో రిలయన్స్ పెట్టుబడులు పెట్టబోతోందని తెలిపారు. పారిశ్రామిక వేత్తలకు ఇలా సహకారం అందిస్తున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్న ముఖేష్ అంబానీ ఈ సమ్మిట్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి :