ENG v PAK విశ్వవిజేత ఇంగ్లండ్…

ENG v PAK విశ్వవిజేత ఇంగ్లండ్.. ఫైనల్లో పాక్ కొంపముంచిన అఫ్రిది గాయం!

Eng v pak టీ20 ప్రపంచకప్ 2022‌లో ఇంగ్లండ్ ఛాంపియన్‌గా నిలిచింది. పాకిస్థాన్‌తో ఆదివారం జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో గెలుపొంది రెండోసారి టైటిల్‌ను ముద్దాడింది. మరోసారి బెన్ స్టోక్స్(49 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్ 52 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించి బిగ్ మ్యాచ్ ప్లేయర్ ట్యాగ్‌ను నిలబెట్టుకున్నాడు. 2016 టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో విలన్‌గా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న స్టోక్స్..

తాజా ఇన్నింగ్స్‌తో వాటిని తుడిపేసుకున్నాడు.ఈ మ్యాచ్ ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 137 పరుగులు మాత్రమే చేసింది. షాన్ మసూద్(28 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 38), బాబర్ ఆజామ్(28 బంతుల్లో 2 ఫోర్లతో 32), షాదాబ్ ఖాన్(14 బంతుల్లో 2 ఫోర్లతో 20) మినహా అంతా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కరన్ మూడు వికెట్లకు తోడుగా.. ఆదిల్ రషీద్, క్రిస్ జోర్డాన్ రెండు వికెట్లు తీసారు. బెన్ స్టోక్స్‌కు ఓ వికెట్ దక్కింది.అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్ 19 ఓవర్లలో 5 వికెట్లకు 138 పరుగులు చేసింది.

బెన్ స్టోక్స్‌కు అండగా జోస్ బట్లర్(17 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 26), మొయిన్ అలీ(12 బంతుల్లో 3 ఫోర్లతో 19) రాణించారు. పాకిస్థాన్ బౌలర్లలో హరీస్ రౌఫ్ రెండు వికెట్లు తీయగా.. షాహిన్ షా అఫ్రిది, షాదాబ్ ఖాన్, మహమ్మద్ వసీం తలో వికెట్ తీసారు. కీలక సమయంలో షాహిన్ షా అఫ్రిది గాయపడటం పాక్ విజయవకాశాలను దెబ్బతీసింది.138 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. షాహిన్ షా అఫ్రిది వేసిన ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్‌లోనే డేంజరస్ బ్యాటర్ అలెక్స్ హేల్స్(1) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. క్రీజులోకి ఫిల్ సాల్ట్ రాగా..

జోస్ బట్లర్ ధాటిగా ఆడే ప్రతయ్నం చేశాడు. కానీ హరీస్ రౌఫ్ తన వరుస ఓవర్లలో ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్‌ను పెవిలియన్ చేర్చాడు. దాంతో ఇంగ్లండ్ పవర్ ప్లేలో 3 వికెట్లకు 49 పరుగులు చేసింది. క్రీజులోకి వచ్చిన హరీ బ్రూక్, బెన్ స్టోక్స్ నిదానంగా ఆడుతూ ఇన్నింగ్స్ చక్కదిద్దారు. క్రీజులో కుదురుకున్న ఈ జోడీని షాదాబ్ ఖాన్ విడదీసాడు. సూపర్ బాల్‌తో హారీ బ్రూక్(20)ను పెవిలియన్ చేర్చాడు. అయితే ఈ క్యాచ్ అందుకునే క్రమంలో షాహిన్ షా అఫ్రిది గాయపడ్డాడు.

ఆ తర్వాత పాక్ బౌలర్లు కట్టడిగా బౌలింగ్ చేయడంతో ఇంగ్లండ్ తీవ్ర ఒత్తిడికి గురైంది. కానీ ఇఫ్తికర్ అహ్మద్ వేసిన 16వ ఓవర్‌లో బెన్ స్టోక్స్.. 4, 6 బాది మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఇక మహమ్మద్ వసీం జూనియర్ వేసిన మరుసటి ఓవర్‌లో మోయిన్ అలీ మూడు బౌండరీలు బాది ఇంగ్లండ్ పనిని మరింత సులువు చేశాడు.

హారీస్ రౌఫ్ 18వ ఓవర్‌లో 5 పరుగులే ఇవ్వడంతో చివర్ ఓవర్‌లో ఇంగ్లండ్ విజయానికి 8 పరుగులు అవసరమయ్యాయి. మహమ్మద్ వసీం జూనియర్ వేసిన 19వ ఓవర్‌లో మోయిన్ అలీ(19) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ ఓవర్ నాలుగో బంతిని బౌండరీ బాదిన స్టోక్స్ 47 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఓవర్ చివరి బంతిని సింగిల్ తీసిన స్టోక్స్.. ఇంగ్లండ్ విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.

click here

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh