BJP 44 rd. foundation day: బీజేపీ 44వ ఆవిర్భావ దినోత్సవం
భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేడు (ఏప్రిల్ 6) తన 44 వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నేటి నుంచి ఏప్రిల్ 14న బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతి వరకు వారం రోజుల పాటు సామాజిక సామరస్య ప్రచారాన్ని నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. దీనికి తోడు ప్రధాని నరేంద్ర మోదీ పార్టీ అగ్రనేత న్యూఢిల్లీలో బిజెపి నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. పార్టీ చరిత్ర, కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలపై సెమినార్లు, చర్చలు నిర్వహించాలని బీజేపీ కార్యకర్తలకు పార్టీ సూచించినట్లు సమాచారం.
భారతీయ జనతా పార్టీ అంటే ఓ మతతత్వ పార్టీ అంటూ కాంగ్రెస్, ఇతర పక్షాలు తొలినుంచీ ఓ రకమైన ముద్ర వేశాయి. భారత్‌కు పొరుగున్న ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో హిందువుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో, భారత్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింల పరిస్థితి అలా తయారవుతుందన్న ప్రచారం ఎక్కువగా కొనసాగింది. కానీ, ఇప్పుడు రెండోసారి కూడా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలో కొనసాగుతున్నా.. సంక్షేమాలు, సంస్కరణలు అమలవుతున్నాయి. ప్రజా సంక్షేమం, సంస్కృతి, ధార్మిక విశ్వాసాలు, ఆచార వ్యవహారాలకు బీజేపీ సమస్థానం ఇస్తోందన్న వాదనలు బలపడుతున్నాయి. రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీపై దేశవ్యాప్తంగా ఒకరకమైన వ్యతిరేకత నెలకొందన్న ప్రచారం జరిగినప్పటికీ. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ నాలుగు రాష్ట్టాల్లో విజయం సాధించడం ఆ పార్టీలో మరింత జోష్ నింపింది.
స్వతంత్ర భారత దేశంలో జరిగిన రెండు అతిపెద్ద ప్రజా ఉద్యమాల్లో మొదటిది ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటం అయితే, రెండోది అయోధ్యలో రామజన్మభూమి విముక్తి ఉద్యమం. శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో ఆలయాన్ని ధ్వంసం చేసి ముస్లిం పాలనలో మసీదు నిర్మించారు. ఆ ఆలయ స్థలాన్ని హిందువులకు అప్పగించాలని, అక్కడ భవ్య రామ మందిరాన్ని నిర్మించాలని ప్రజలు దశాబ్దాలుగా కోరుతూనే ఉన్నా.. అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీ సహా ఇతర రాజకీయ పార్టీలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయి. ముస్లింల ఓట్ల కోసం ప్రజల మనోభావాలను గుర్తించలేదన్న విమర్శలు ఉన్నాయి. ఆ సమయంలో అయోధ్య ప్రజా ఉద్యమానికి బాహాటంగా మద్దతు పలికిన ఏకైక పార్టీ బీజేపీ. ఈ పరిణామం ఒకరకంగా దేశ రాజకీయాలనే మలుపు తిప్పింది. అప్పటి బీజేపీ అధ్యక్షుడు ఆద్వానీ 1990లో సోమనాథ్ నుంచి అయోధ్య వరకు పది వేల కిలోమీటర్ల రథయాత్ర నిర్వహించారు. బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో నాలుగు రాష్ట్రాల బీజేపీ ప్రభుత్వాలను రద్దు చేసినప్పటికీ, పార్టీ నాయకులపై తప్పుడు కుంభకోణాల అభియోగాలు మోపినప్పటికీ భారతీయ జనతాపార్టీ ఏమాత్రం తగ్గలేదు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తుది తీర్పు రావడంతో ఆ ఉద్యమానికి సంబంధించిన అన్ని సమస్యలు సమసిపోయాయి. ఉద్యమం మొదలైన మూడు దశాబ్దాల తర్వాత రామాలయ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు.
ఈ పరిణామాల తర్వాత పలు పార్టీల మద్దతుతో బీజేపీ 1999 నుంచి 2004 వరకు కేంద్రంలో అధికారంలో కొనసాగింది. ఇక, 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ చరిత్ర సృష్టించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా లోక్‌సభలోని మొత్తం 543 సీట్లలో.. తన మిత్రపక్షాలతో కలిసి జాతీయ ప్రజాస్వామ్య కూటమి-ఎన్డీయే నేతృత్వంలో 281 స్థానాలు గెలుచుకొంది. నరేంద్రమోడీ నాయకత్వంలో అధికారం చేపట్టింది. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 303 స్థానాల్లో విజయం సాధించి రెండోసారి కేంద్రంలో అధికారం చేపట్టింది.
కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ.. అత్యంత సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంది. 2019 ఆగస్టు 5వ తేదీన ఆర్టికల్ 370ని రద్దు చేసింది. ఆ ఆర్టికల్ ఎత్తేస్తే వేర్పాటువాదం విజృంభిస్తుందని, కశ్మీర్ భారత్‌కు శాశ్వతంగా దూరమవుతుందనే ప్రచారం పెద్ద ఎత్తున చేశారు. కానీ, ఆ వాదనలు అసంబద్ధమన్న విషయం జరుగుతున్న పరిణామాలతో తేటతెల్లమయ్యింది. జమ్ముకశ్మీర్‌లో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నేరుగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది.
పౌరసత్వ సవరణ చట్టం అనేది.. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న మరో సాహసోపేతమైన నిర్ణయం పౌరసత్వ చట్టం-1955లో సవరణ తెస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు 2019 డిసెంబరు 9వ తేదీన పార్లమెంటు ఉభయసభల్లోనూ ఆమోదం లభించింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్ వంటి ముస్లిం దేశాల నుంచి మనదేశానికి వలస వచ్చే ఆ దేశాల్లోని మైనారిటీలకు భారత పౌరసత్వం ఇచ్చేందుకు ఈ పరిణామంతో మార్గం సులువయ్యింది. మోడీ ప్రభుత్వం తీసుకున్న మరో సంచలన నిర్ణయం త్రిపుల్ తలాక్ రద్దు. ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు ఇవ్వడాన్ని నేరంగా పరిగణిస్తూ మోడీ ప్రభుత్వం లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టింది. ఈ బిల్లుకు 2018 డిసెంబర్ 27న లోక్‌సభ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం ముస్లిం మహిళలకు ట్రిపుల్ తలాక్ చెప్పడం నేరం. త్రిపుల్ తలాక్ రద్దును ముస్లిం మహిళలంతా ఆహ్వానించారు.
ఇలా విజయపథంలో దూసుకుపోతున్న బీజేపీ నేడు 44వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకుంటోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శోభాయాత్రలో పాల్గొననున్నారు. శోభాయాత్ర తర్వాత మోడీ ప్రసంగాన్ని మండల, గ్రామస్థాయిలో వినేందుకు బీజేపీ శ్రేణులు ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేసుకున్నాయి.
Tomorrow, 6th April is an important day for @BJP4India as it is the Sthapana Diwas of the Party. At around 10 AM, will be addressing Party Karyakartas.
— Narendra Modi (@narendramodi) April 5, 2023