రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో  తప్పిన  ఘోర ప్రమాదం

Rajdhani Express: రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో  తప్పిన  ఘోర ప్రమాదం

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ఆదివారం చెన్నై-ఢిల్లీ రాజధాని  ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి రైల్వే స్టేషన్​లో హుటాహుటిన రైలును నిలిపివేశారు. రాజధాని ఎక్స్ప్రెస్ బి-5 బోగి వద్ద పొగలు రావడంతో రైల్వే అధికారులు గమనించారు. కావలి రైల్వేస్టేషన్‌లో రైలును ఆపిన లోకో పైలట్‌ చక్రాల రాపిడి వల్ల పొగలు వస్తున్నట్లు గుర్తించారు. పొగలు వచ్చిన విషయం తెలిసి ప్రయాణికులు భయపడి పోయారు. అందరూ కిందకి దిగి పరుగులు తీశారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. కావలి రైల్వేస్టేషన్ సమీపంలో రైలును 20 నిమిషాల పాటు నిలిపివేశారు. బ్రేక్ జామ్ కారణంగా పొగలు వచ్చినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. మరమ్మతుల అనంతరం రైలు తిరిగి ప్రయాణాన్ని ప్రారంభించింది. అయితే ఈ ఘటనతో పెద్దగా ఇబ్బంది లేకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ముప్పై నిమిషాల తరువాత స్వల్ప మరమ్మతుల అనంతరం రాజధాని ఎక్స్‌ప్రెస్‌ ముందుకు కదిలింది. ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా గందరగోళంగా మారింది. ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని రైల్వే అధికారులు స్పష్టం చేశారు.

ఇలాగే గత ఏడాది రేణిగుంట, తిరుచానూరు రైల్వే స్టేషన్ మధ్యలో ఉన్న CRS లో ఓ రైలు ఇంజిన్ పట్టాలు తప్పింది. తిరుపతి నుంచి రేణిగుంట వెళ్తున్న రైలుకి ఇచ్చిన సిగ్నల్ ను తనదిగా భావించిన లోకో పైలెట్ ఇంజిన్ ను ముందుకు కదిపారు. ఈ లోపు అసలు ట్రైన్ వస్తుండటంతో ట్రాక్ మార్చే ప్రయత్నంలో ఇంజిన్ పట్టాలు తప్పింది. పక్కనే బురదలోకి దిగిపోయింది రైలు ఇంజిన్. లోకో పైలెట్ సిగ్నల్ ను తప్పుగా అర్థం చేసుకోవటంతోనే ప్రమాదం జరిగిందని రైల్వే పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ప్రమాదంలో లోకో పైలెట్ సురక్షితంగా బయటపడ్డారు. సంఘట స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది ఇంజన్ కు మరమ్మతులు చేపట్టారు.

 

Leave a Reply