పెండింగ్ బిల్లులపై విచారణను ఈనెల 21కి వాయిదా

Telangana:పెండింగ్ బిల్లులపై విచారణను ఈనెల 21కి వాయిదా

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వద్ద ఉన్న పెండింగ్ బిల్లులపై నేడు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.  ఈ క్రమంలో వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను ఈనెల 21కి వాయిదా వేసింది. కాగా చట్టసభల్లో ఆమోదం పొందిన బిల్లులను గవర్నర్ ఆమోదం తెలపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్ ను పరిగణలోకి తీసుకున్న కోర్టు విచారణ జరిపింది. కాగా నేడు ఈ పిటీషన్ పై విచారణ జరిగే ముందే గవర్నర్ 3 బిల్లులకు ఆమోదం తెలపడం గమనార్హం.

కాగా తెలంగాణ  ఉభయసభల్లో ఆమోదం పొంది గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న 10 బిల్లుల్లో మూడు బిల్లులను గవర్నర్ ఆమోదించారు. అలాగే మరో రెండు బిల్లులను ఆమోదం కోసం రాష్ట్రపతికి పంపించారు. ఇక మరో రెండు బిల్లులను తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ పంపించారు. మిగిలిన 3 బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్నాయి. అయితే గవర్నర్ ఆమోదించిన బిల్లులు ఏంటి? తిరిగి పంపిన బిల్లులు ఏంటనేవి తెలియాల్సి ఉంది.

గతేడాది జరిగిన తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాల్లో పలు బిల్లులు ఆమోదం పొందాయి. వర్శిటీల్లో నియామకాలు చేపట్టేందుకు ఉమ్మడి బోర్డు ఏర్పాటు, సిద్దిపేట  జిల్లా ములుగులోని అటవీ కళాశాల, పరిశోధన సంస్థ తెలంగాణ అటవీ విశ్వవిద్యాలయంగా మార్పు, ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాలకు అనుమతిచ్చేలా.. ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ, జీహెచ్‌ఎంసీ, పురపాలక చట్టాలకు సవరణ, పబ్లిక్‌ ఎంప్లాయ్‌మెంట్‌ చట్టం, అజామాబాద్‌ పారిశ్రామిక ప్రాంత చట్టం, జీఎస్టీ  చట్టాలను సవరిస్తూ బిల్లులను ప్రభుత్వం తీసుకొచ్చింది

రాజ్యాంగం ఆదేశం ప్రకారం గవర్నర్ తప్పనిసరిగా బిల్లులను క్లియర్ చేయాల్సి ఉందని పేర్కొంది. బిల్లులపై గవర్నర్‌కు ఏమైనా సందేహాలుంటే వారు వివరణలు కోరవచ్చని తెలిపింది. కానీ గవర్నర్ వాటిని తన వద్దే పెండింగ్‌లో ఉంచలేరని పేర్కొంది. గవర్నర్ బిల్లుల విషయంలో ఏవైనా సమస్యలను లేవనెత్తితే తాము వాటిని  స్పష్టం చేస్తామని చెప్పింది. గవర్నర్ వాటిని తనవద్ద ఉంచుకోవద్దని ఈ విషయంలో రాజ్యాంగం  ఆదేశం స్పష్టంగా రాష్ట్రానికి అనుకూలంగా ఉందని తెలిపింది.

 

Leave a Reply