నేడు సిరిసిల్లకు కేటీఆర్‌ రాక

KTR:నేడు సిరిసిల్లకు కేటీఆర్‌ రాక

మంత్రి కేటీఆర్ నేడు సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. తంగళ్లపల్లి మండలం జిల్లెళ్ల గ్రామంలో కోల్డ్ స్టోరేజీ కేంద్రాన్ని, అనంతరం వ్యవసాయ కళాశాలను కేటీఆర్ ప్రారంభించనున్నారు.

దీంతో పాటు అంబేద్కర్‌ విగ్రహాన్ని కేటీఆర్‌ ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ పోచారం, మంత్రి నిరంజన్‌రెడ్డి పాల్గొంటారు.

రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9.45 గంటలకు హెలికాప్టర్‌లో తంగళ్లపల్లి మండలం జిల్లా వ్యవసాయ కళాశాలకు చేరుకుంటారు. ఉదయం 10 గంటలకు జిల్లాల్లో నిర్మించిన ప్రాథమిక ప్రాసెసింగ్‌ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. అనంతరం అక్కడ నిర్మించిన వ్యవసాయ కళాశాల భవన సముదాయాన్ని ప్రారంభించి విద్యార్థులు, ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం మంత్రి నిరంజన్‌రెడ్డి, సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి హెలికాప్టర్‌లో తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు. మంత్రి కేటీఆర్ మధ్యాహ్నం 1.30 గంటలకు రోడ్డు మార్గంలో ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామానికి చేరుకుని ఎస్టీ హాస్టల్ భవనాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు ముస్తాబాద్ మండలం మద్దికుంట శివారులోని మెట్టుబండలలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించే ఆత్మీయ సమ్మేళనానికి హాజరవుతారు. కాగా, మంత్రుల రాక సందర్భంగా అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కళాశాల ప్రారంభోత్సవానికి ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్‌, చెన్నమనేని రమేశ్‌బాబు, సుంకె రవిశంకర్‌, నాఫ్‌స్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు అతిథులుగా హాజరుకానున్నారు.

ఐదెకరాల విశాలమైన స్థలం అద్దాల్లాంటి రోడ్లు ఆధునిక వసతులతో సిరిసిల్లలో కోల్డ్‌స్టోరేజ్‌ నిర్మాణం పూర్తయింది. మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక చొరవతో జిల్లెల్ల శివారులో 6.50 కోట్ల వ్యయంతో 500 మెట్రిక్‌ టన్నుల నిల్వ సామర్థ్యమున్న శీతల గిడ్డంగి రూపుదిద్దుకున్నది. ఏడాదిన్నరలోనే ప్రధాన పనులన్నీ పూర్తిచేసుకొని, తుదిమెరుగులు అద్దుకుంటున్నది. త్వరలోనే అందుబాటులోకి రాబోతుండగా, ఇక రైతుల పంట ఉత్పత్తుల నిల్వ బాధ దూరం కానున్నది.

కాళేశ్వర జల విప్లవంతో పంటలు పుష్కలంగా పండుతున్నాయి. మద్దతు ధర ఉన్నప్పుడు లాభం భారీగానే వస్తుంది. అయితే, ధర లేని సమయాల్లోనే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తక్కువ ధరకే అమ్ముకోవాల్సిన పరిస్థితి. అదే కోల్డ్‌ స్టోరేజ్‌లు ఉంటే ఆ బాధ ఉండదు. అయితే ధర ఉన్నపుడు అమ్ముకోవడం, లేని సమయాల్లో ఇక్కడ నిల్వ చేసుకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం కోల్డ్‌స్టోరేజీలను నిర్మిస్తున్నది. అందులో భాగంగానే రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్మించిన శీతల గిడ్డంగి నిర్మాణం పూర్తి చేసుకొని, గోదాంతో రైతులకు మేలు జరుగడమే కాదు, స్థానికులకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి.

 

 

 

Leave a Reply