INDVNZ భారత్‌లో ఒకే ఒక్కడు…

INDVNZ భారత్‌లో ఒకే ఒక్కడు.. రెండో టీ20లో మూడు ప్రపంచ రికార్డులు బద్దలు..!

INDVNZ సూర్యకుమార్ విశ్వరూపం చూపడంతో న్యూజిల్యాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా అద్భుతమైన విజయం సాధించింది. సూర్య అజేయ శతకంతో 191 పరుగులు చేసిన భారత్.. కివీ బ్యాటర్లను 126 పరుగులకే ఆలౌట్ చేసేసింది. ఆ జట్టులో కివీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (61) హాఫ్ సెంచరీ సాధించినా.. భారీ లక్ష్య ఛేదనలో అతను నెమ్మదిగా ఆడటంతో ఆ జట్టు విజయావకాశాలు దెబ్బతిన్నాయి. ఈ మ్యాచ్‌లో 65 పరుగుల తేడాతో భారత జట్టు విజయం సాధించింది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్‌లో మూడు రికార్డులు బద్దలయ్యాయి. అవేంటంటే?

1.ఈ మ్యాచ్‌లో చివరి ఓవర్లో బ్యాటింగ్‌కు వచ్చిన దీపక్ హుడా తొలి బంతికే గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. అయితే బంతితో మాత్రం అదరగొట్టాడు. ఆఫ్ స్పిన్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టిన హుడా.. టెయిలెండర్ల పనిపట్టాడు. వేసింది 2.5 ఓవర్లే అయినా నాలుగు వికెట్లు పడగొట్టాడు.పార్ట్ టైమ్ బౌలర్ అయ్యుండి పెద్దగా పరుగులు కూడా ఇవ్వలేదు. తన స్పెల్‌లో కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో టీ20 క్రికెట్‌లో సెంచరీ చేయడంతోపాటు ఒక మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసుకున్న తొలి భారతీయ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఐర్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో హుడా సెంచరీ చేసిన సంగతి తెలిసిందే.

2.టీ20 క్రికెట్‌లో ఆట బ్యాటర్లకే కొంత అనుకూలంగా ఉంటుంది. అయితే బౌలర్లకు కూడా తాము షైన్ అయ్యే అవకాశాలు వస్తుంటాయి. ఇదే అవకాశం టిమ్ సౌథీకి వచ్చింది. భారత్, న్యూజిల్యాండ్ మధ్య జరిగిన రెండో టీ20లో చివరి ఓవర్ వేసిన సౌథీ.. హ్యాట్రిక్‌తో చెలరేగాడు.వరుసగా హార్దిక్ పాండ్యా, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్ ముగ్గుర్నీ పెవిలియన్ చేర్చాడు. అంతకుముందు 2010లో పాకిస్తాన్‌పై కూడా సౌథీ ఇలాగే హ్యాట్రిక్ తీసుకున్నాడు. దీంతో పొట్టి ఫార్మాట్‌లో ఒకటి కంటే ఎక్కుసార్లు హ్యాట్రిక్ తీసిన రెండో బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. గతంలో శ్రీలంక లెజెండ్ లసిత్ మలింగ కూడా ఇలాగే టీ20ల్లో రెండుసార్లు హ్యాట్రిక్ తీసుకున్నాడు.

3.టీమిండియా ఈ ఏడాది ఎన్నో రికార్డులు బద్దలు కొట్టింది. న్యూజిల్యాండ్‌తో జరిగిన రెండో టీ20 ఈ ఏడాదిలో భారత్ ఆడిన 62వ అంతర్జాతీయ మ్యాచ్. క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు మరే జట్టు ఒక క్యాలెండర్ ఇయర్‌లో ఇన్ని మ్యాచులు ఆడలేదు. అలాగే కివీస్‌పై 65 పరుగుల తేడాతో భారీ విజయం కూడా నమోదు చేసింది టీమిండియా. ఈ క్రమంలో మరో రికార్డు కూడా బద్లలు కొట్టింది. ఒక ఏడాదిలో పది మ్యాచుల్లో 50పైగా పరుగుల తేడాతో గెలిచిన జట్టుగా రికార్డు సృష్టించింది. ఈ జాబితాలో రెండో స్థానంలో న్యూజిల్యాండ్ ఉంది. ఈ జట్టు ఇదే ఏడాదిలో ఆరు మ్యాచుల్లో 50పైగా పరుగుల తేడాతో విజయాలు నమోదు చేసింది.

INDvsNZ: రెండో టీ20లో పాండ్యా చేసిన తప్పులు.

ప్రపంచ నెంబర్ వన్ టీ20 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ విశ్వరూపం చూపడంతో న్యూజిల్యాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఘనవిజయం సాధించింది. సూర్య అజేయ శతకంతో 191 పరుగులు చేసిన భారత్.. కివీ బ్యాటర్లను 126 పరుగులకే ఆలౌట్ చేసేసింది. ఆ జట్టులో కివీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (61) హాఫ్ సెంచరీ సాధించినా.. భారీ లక్ష్య ఛేదనలో అతను నెమ్మదిగా ఆడటంతో ఆ జట్టు విజయావకాశాలు దెబ్బతిన్నాయి.ఈ మ్యాచ్‌లో 65 పరుగుల తేడాతో భారత జట్టు విజయం సాధించింది.

ఇలా భారీ విజయం సాధించినా కూడా టీమిండి ఈ మ్యాచులో రెండు పొరపాట్లు చేసింది. దాని వల్ల జరిగిన నష్టాన్ని ఒక మాస్టర్ స్ట్రాటజీతో పూడ్చుకొని ఘనవిజయం తన ఖాతాలో వేసుకుంది.ఇప్పుడు టీమిండియా ఫోకస్ అంతా వచ్చే టీ20 వరల్డ్ కప్ కోసం జట్టును ఎలా తయారు చెయ్యాలా? అనే. అలాంటి సమయంలో భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్ వంటి సీనియర్ ఆటగాళ్లను జట్టులోకి తీసుకొని ఉమ్రాన్ మాలిక్ వంటి యువపేసర్‌ను పక్కన పెట్టడం అందరికీ షాకిచ్చింది.అలాగే అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సంజూ శాంసన్‌ను కాదని ఈ ఫార్మాట్‌లో పెద్దగా ఆకట్టుకోని రిషభ్ పంత్, శ్రేయాస్ అయ్యర్‌లకు అవకాశం ఇచ్చారు. వీళ్లిద్దరూ ఈ మ్యాచ్‌ పూర్తిగా విఫలమై జట్టులో సంజూ ఎంత ముఖ్యమో మరోసారి తేటతెల్లం చేశారు.

ఇలా జట్టు కూర్పులో టీమిండియా పెద్ద పొరపాటే చేసింది.
దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్ ఇద్దరూ బ్యాటింగ్ చేయగలరు కానీ.. ఫినిషర్లు కాదు. దినేష్ కార్తీక్ తర్వాత ఆ పాత్రను సమర్ధవంతంగా పోషించే ప్లేయర్ లేడనే మాట నిజమే కానీ.. ప్రస్తుతం జట్టులో ఫినిషర్‌గా ఉన్న బెస్ట్ ఆప్షన్ హార్దిక్ పాండ్యనే. కానీ అతను మాత్రం ఆ బాధ్యతను హుడా, సుందర్ భుజాలపై వేసేసి శ్రేయాస్ అవుటవగానే తను క్రీజులోకి వచ్చాడు. మొత్తం 13 బంతులు ఎదుర్కొన్నా కూడా ఒక్క బౌండరీ కూడా బాదలేకపోయాడు.

టీమిండియాలో ఉన్న బౌలింగ్ ఆప్షన్లు అన్నింటినీ పాండ్యా ఉపయోగించుకున్నాడు. వరల్డ్ కప్‌లో ఆడే అవకాశం దక్కని చాహల్, సిరాజ్‌లు ఈ మ్యాచ్‌లో సత్తా చాటారు. ఆ తర్వాత పార్ట్ టైమర్ హుడా కూడా అదరగొట్టాడు. వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్ కూడా ఆకట్టుకున్నారు. అర్షదీప్ కూడా బాగానే బౌలింగ్ చేశాడు.ఈ మ్యాచ్‌లో హార్దిక్ బౌలింగ్ చేయలేదు కానీ.. ఆరుగురు బౌలర్లు బౌలింగ్ చేశారు. వీరిలో ఐదుగురు వికెట్లు సాధించారు. గతంలో రోహిత్‌ కూడా ఆరో బౌలింగ్ ఆప్షన్ కావాలంటూ హుడాను జట్టులోకి తీసుకున్నాడు. కానీ అతనితో బౌలింగ్ వెయ్యనివ్వలేదు. ఈ పొరపాటు చెయ్యని పాండ్యా.. హుడా సహా తన వద్ద ఉన్న బౌలింగ్ వనరులు అన్నింటినీ చాలా చక్కగా ఉపయోగించుకుని అద్భుతమైన విజయం సాధించాడు.

కోహ్లీ కెరీర్ నాశనం చేసేందుకు చూశారు..

ఆసియా కప్‌ ఫైనల్ చేరడంలో విఫలమైన టీమిండియా.. టీ20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌లో చిత్తుగా ఓడింది. ఈ నేపథ్యంలో జట్టు ఎంపికపై కూడా పలు విమర్శలు వచ్చాయి. దీంతో చేతన్ శర్మ నేతృత్వంలోని మొత్తం సెలెక్షన్ కమిటీని తొలగిస్తూ బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. వీరి స్థానంలో కొత్త వారిని తీసుకునేందుకు దరఖాస్తులు ఆహ్వానించింది.

ఈ క్రమంలో సెలెక్షన్ కమిటీపై పాక్ మాజీ స్పిన్నర్ దానిష్ కనేరియా సంచలన ఆరోపణలు చేశాడు.చేతన్ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ చాలా తప్పులు చేసిందని చెప్పిన కనేరియా.. టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ కెరీర్ నాశనం చేసేందుకు ఆ బృందం ప్రయత్నించిందంటూ సంచలన ఆరోపణలు చేశాడు. ‘కోహ్లీ ఫామ్‌లో లేక తంటాలు పడుతున్నప్పుడు అతనికి మద్దతివ్వాల్సింది పోయి.. కొన్ని సిరీసుల్లో మాత్రమే ఆడిస్తూ అతని కెరీర్ నాశనం చేసేందుకు ప్రయత్నించారు.

దానికితోడు కెప్టెన్సీ నుంచి అబద్ధాలు చెప్పి కోహ్లీని తొలగించారు కూడా’ అని చెప్పాడు.గతేడాది టీ20 వరల్డ్ కప్ తర్వాత పొట్టి ఫార్మాట్‌లో కెప్టెన్సీకి వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లీ.. వన్డే, టెస్టుల్లో కెప్టెన్‌గా కొనసాగాలని అనుకున్నాడు. కానీ వైట్ బాల్ క్రికెట్‌లో వేరు వేరు కెప్టెన్‌లు వద్దనుకున్న సెలెక్షన్ కమిటీ మాట మాత్రం చెప్పకుండా అతన్ని వన్డే సారధ్యం నుంచి తప్పించింది.
ఇదే విషయాన్ని గుర్తుచేసిన కనేరియా.. ‘కోహ్లీని కెప్టెన్సీ నుంచి ఎలా తొలగించారో అందరికీ తెలుసు.

అతనే తనతో మాటమాత్రం చెప్పలేదని వెల్లడించాడు’ అన్నాడు. ఇలా కోహ్లీని నాశనం చేసేందుకు సెలెక్షన్ కమిటీ ప్రయత్నించిందని, కానీ కోహ్లీ మాత్రం అన్నింటినీ అధిగమించి తన సత్తా నిరూపించుకున్నాడని కొనియాడాడు.చేతన్ శర్మ బృందం చేసిన మరో పెద్ద పొరపాటు వరుస పెట్టి కెప్టెన్లను మార్చడం అని అందరూ అంటున్నారు. కనేరియా కూడా ఇదే మాటన్నాడు. ‘వరుసగా కెప్టెన్లు మార్చేయడంతోపాటు చాలా మంది అర్హులైన ఆటగాళ్లకు చేతన్ శర్మ కమిటీ సరైన అవకాశాలు కూడా ఇవ్వలేదు.

ఇలా జట్టులో మరీ ఎక్కువగా మార్పులు చేయడంతో చాలా మంది ఆటగాళ్లు.. జట్టులో ఎక్కువ కాలం ఉండలేకపోయారు’ అని వివరించాడు.సెలెక్షన్ కమిటీలో మాజీ ప్లేయర్లు ఉండటం సబబే అన్ని కనేరియా.. కానీ తమ కెరీర్‌లో ఏదైనా సాధించిన వారికి అవకాశం ఇవ్వాలని సూచించాడు. చేతన్ శర్మ క్రికెట్ కెరీర్ చాలా నిరాశాజనకంగా ఉందని, కాబట్టి ఎవరైన విలువైన వారికి ఈ అవకాశం దక్కితే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. చేతన్ శర్మ కమిటీ సెలెక్షన్ చాలా ప్రశ్నలు లేవనెత్తిందని విమర్శించాడు. మరి కొత్త సెలెక్షన్ కమిటీలో ఎవరు చేరతారో చూడాలి.

Dimple Hayathi In Shankars Movie keerthi suresh