విశాఖ పొట్ట కొడుతున్నది ప్రధాని మోదీనే: కేటీఆర్‌

 

Minister KTR: విశాఖ పొట్ట కొడుతున్నది ప్రధాని మోదీనే: కేటీఆర్‌

ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలన్నదే తమ ఆలోచన అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం విక్రయిస్తోందని మండిపడ్డారు.

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ టేకోవర్‌పై బీజేపీ నాయకులు చేస్తున్న ఆరోపణలపై మంత్రి కేటీఆర్‌ సీరియస్‌ అయ్యారు. విశాఖ ఉక్కు విషయంలో చూపిస్తున్న ఉత్సాహం బయ్యారం విషయంలో ఎందుకు చూపిస్తలేరని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు అడుగుతున్న ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. విషయం పరిజ్ఞానం లేని ఆయనకు చెబితే ఓ బాధ.. చెప్పకుంటే ఓ బాధ అని మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. ఆయనకు వచ్చిన సందేహం మరెవరికీ రావొద్దనే ఉద్దేశంతో దీనిపై పూర్తి వివరణ ఇచ్చారు.

విశాఖ ఉక్కుకు, బయ్యారం స్టీల్‌ ప్లాంట్‌కు మధ్య ఉన్న ముఖ్యమైన సంబంధం బైలదిల్లాలో ఉండే ఐరన్‌ ఓర్‌. బైలదిల్లా అనేది ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఒడిశా దాకా వ్యాపించిన ఐరన్‌ ఓర్ గని. ఇది చాలా పెద్ద గని. 134 కోట్ల మెట్రిక్‌ టన్నుల ఐరన్‌ ఓర్‌ ఉన్న గని బైలదిల్లా. భౌగోళికంగా చూస్తే ఇది బయ్యారం నుంచి 150-160 కిలోమీటర్ల దూరంలో ఉంది. వైజాగ్‌ నుంచి 600 కిలోమీటర్ల దూరంలో ఉంది. బైలదిల్లాలో నాణ్యమైన ఐరన్‌ ఓర్‌ ఉందని కేంద్ర ప్రభుత్వ సంస్థలే తేల్చిచెప్పాయి. ‘ అని తెలిపారు.

2014లో రాష్ట్రం ఏర్పడినప్పుడు బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో వివరంగా చెప్పారు. అదేవిధంగా కడపలో కూడా స్టీల్‌ అధారిటీ ఆఫ్‌ ఇండియా ద్వారా అక్కడ స్టీల్‌ ప్లాంట్‌ పెట్టే అవకాశాన్ని పరిశీలిస్తామని పేర్కొన్నారు. తెలంగాణలోని బయ్యారం గురించి మేం అడగగలం కాబట్టి.. 2014 నుంచి అడుగడుగున ప్రశ్నిస్తూ వస్తున్నాం. అలాగే  సీఎం కేసీఆర్‌ పలుమార్లు కేంద్రానికి లేఖ రాశారు. ప్రధానిని స్వయంగా కలిసి బయ్యారం స్టీల్‌ప్లాంట్‌ గురించి మాట్లాడా. బయ్యారం స్టీల్‌ప్లాంట్‌పై కుట్రలు చేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు గనులు, నిధులు. ఇవ్వకపోవడంతోనే నష్టాలు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను నష్టాల్లోకి నెట్టి అమ్మడానికి చూస్తున్నారు” అని కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

బయ్యారం గురించి మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని దానిపై వివరించాం. బయ్యారం ఎక్కడైతే ఉందో అక్కడ దొరికే ఐరన్‌ ఓర్‌ లో గ్రేడ్‌ ఉందని.. ఫెర్రస్‌ నాణ్యత 64 శాతం ఉంది కాబట్టి సాధ్యం కాదని మీ వాళ్లు తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పా. కానీ బయ్యారం నుంచి 150-160 కిలోమీటర్లలోపే బైలదిల్లా ఉంది. బైలదిల్లా నుంచి మొత్తం ఫారెస్టే ఉంది. కాబట్టి మనం ఒక స్లరీ పైప్‌లైన్‌ వేసుకోవచ్చు. స్లరీ పైప్‌లైన్‌ వేయడంలో 50 శాతం వాటా తెలంగాణ ప్రభుత్వం కూడా భరిస్తుంది. బయ్యారంలో ప్లాంట్‌ పెడితే 15, 20వేల మంది మా గిరిజన బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. తెలంగాణకు ఆదాయం వస్తుంది. ఒక వెనుకబడిన ప్రాంతానికి ఫ్యాక్టరీ వస్తుంది. మీరిచ్చిన మాట నిలబెట్టుకున్నట్టు అవుతుంది. అని 2018లో స్వయంగా ప్రధాని మోదీని కలిసి విజ్ఞప్తి చేశా. మొత్తం వివరాలను సమర్పించా. అప్పటికే ముఖ్యమంత్రి, అధికారుల బృందాలు కలిసి చెప్పాయి.

అయితే అసలు ”విశాఖ పొట్ట కొడుతున్నది ప్రధాని మోదీనే. బయ్యారం విషయంలో కూడా అదే జరుగుతుంది. నేను చెప్పింది తప్పయితే పరువు నష్టం దావా వేయండి. తెలుగు రాష్ట్రాలకు విరుద్ధంగా బీజేపీ పనిచేస్తోంది” అని కేటీఆర్‌ విమర్శించారు.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh