Polavaram : పోలవరానికి మళ్ళీ తిప్పలే…

Polavaram : పోలవరానికి మళ్ళీ తిప్పలే…..

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించిన నాలుగు రాష్ట్రాలతో కేంద్ర జలశక్తి శాఖ నిర్వహించిన సమావేశం ముగిసింది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్ట్ బ్యాక్‌వాటర్‌పై కేంద్రం అధ్యయనం చేస్తోన్న సంగతి తెలిసిందే. 2019, 2011లలో పోలవరం బ్యాక్ వాటర్‌పై సర్వేలు జరిగాయని కేంద్రం చెబుతోంది.

ముంపు ప్రభావంపై ఒడిశా, తెలంగాణ , ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు అపోహలు పడుతున్నాయని కేంద్రం అభిప్రాయపడింది. భద్రాచలానికి ఎలాంటి ముంపు లేదని కేంద్రం స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్ట్ పూర్తయ్యాక కూడా మూడు రాష్ట్రాల్లో అడుగులో మూడో వంతు ముంపు ప్రభావం కూడా వుండదని కేంద్రం చెప్పింది.

ముంపు ప్రభావం లేకుండా కరకట్ట కట్టేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైనా .. ఒడిషా ప్రజాభిప్రాయ సేకరణకు ముందుకు రాలేదని కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 7న సాంకేతిక నిపుణులతో కేంద్ర జలశక్తి శాఖ మరోసారి భేటీ కానుంది.

 

అయితే …పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ముంపునకు గురయ్యే ప్రాంతాలపై రీసర్వే చేయాల్సిందేనని తెలంగాణ, ఛత్తీ్‌సగఢ్‌, ఒడిశా రాష్ట్రాలు పట్టుబడుతున్నాయి. అయితే మళ్లీ సర్వే అంటే ప్రాజెక్టుకు తిప్పలేనని సాగునీటి రంగ నిపుణులు పేర్కొంటున్నారు.

పోలవరంతో తమ భూభాగాలకు భారీనష్టం వాటిల్లుతుందని, తమ రాష్ట్ర ప్రజలు ముంపునకు గురవుతారని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌ నేతృత్వంలో గత నెల 29న జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో తెలంగాణ, ఒడిశా, ఛత్తీ్‌సగఢ్‌ తెగేసి చెప్పాయి. తమ ప్రజలకు పరిహారం చెల్లించకుండా ఒక్క అడుగు ముందుకు వెళ్లేందుకు వీల్లేదని స్పష్టం చేస్తున్నాయి.

polavaram ప్రాజెక్టు కారణంగా భద్రాచలం ముంపునకు గురవుతుందని, 180 గ్రామాలకు పునరావాసం కల్పించాల్సి ఉంటుందని తెలంగాణ పేర్కొంటోంది. ఈ ఏడాది జూలైలో వచ్చిన వరదకు ఈ గ్రామాలన్నీ ముంపునకు గురయ్యాయని కేంద్రానికి వివరించింది.

ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయకముందే తమ రాష్ట్రంలోని 180 గ్రామాలు ముంపునకు గురైతే, ఇక 50లక్షల క్యూసెక్కులు నిల్వచేసి, బ్యాక్‌వాటర్‌ ఎగదన్నితే భద్రాచలం పరిస్థితి ఏమిటని నిలదీస్తోంది. ఈ నేపథ్యంలో ముంపు ప్రాంతాలపై కొత్తగా సర్వే చేపట్టాలని తెలంగాణ కోరుతోంది.

అదేవిధంగా ఈ ప్రాజెక్టుతో తమ రాష్ట్రం ఘోరంగా నష్టపోతుందని ఒడిశా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎత్తయిన కరకట్టలు నిర్మించినా నీటి నిల్వలు చాలాకాలం పాటు కొనసాగడం వల్ల తమ రాష్ట్రంలో భారీగా ముంపు ప్రమాదం ఏర్పడుతుందని వాదిస్తోంది. దాదాపుగా ఇదే వాదనను ఛత్తీ్‌సగఢ్‌ కూడా వినిపిస్తోంది.

స్పందించని కేంద్రం పోలవరం ప్రాజెక్టు 45.72 మీటర్ల కాంటూరులో 194.6 టీఎంసీల నీటినిల్వ కోసం 1,67,765 ఎకరాలకు గాను 1,13,119 ఎకరాలు మాత్రమే సమీకరించారు. మరో 54,646 ఎకరాల భూసేకరణ, సహాయ పునరావాసం కోసం దాదాపు రూ.28,482 కోట్లు వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు.

ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లకు కేంద్ర జలసంఘం ఆధ్వర్యంలోని సాంకేతిక సలహా కమిటీ(టీఏసీ) ఆమోదించినా ఇప్పటి వరకూ ఈ మొత్తానికి కేంద్రం సమ్మతి తెలపడం లేదు. ఇదిలా ఉండగానే పోలవరం దిగువ కాఫర్‌ డ్యామ్‌ను సేఫ్‌ లెవెల్‌కు 30 మీటర్ల ఎత్తుకు నిర్మించకపోవడంతో ఈ ఏడాది జూలైలో వరద చొచ్చుకు పోయింది.

ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ మధ్యలో భారీగా వరదనీరు చేరి మినీ రిజర్వాయర్‌ను తలపిస్తోంది. ఈ వరద కారణంగా డయాఫ్రమ్‌వాల్‌ దెబ్బతిందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే ఆ విషయం శాస్త్రీయంగా సాంకేతిక అధ్యయనం చేశాకే తెలుస్తుందని కేంద్ర జల సంఘం స్పష్టం చేస్తోంది.

ఈ అధ్యయనం కోసం కేంద్రం పంపిన నేషనల్‌ హైడ్రో పవర్‌ కార్పొరేషన్‌(ఎన్‌హెచ్‌పీసీ) బృందం పోలవరంలో పర్యటిస్తున్న సమయంలోనే ఒక్కసారిగా వరద ముంచెత్తింది. ఈ వరద నవంబరు నెలాఖరు వరకూ తగ్గే అవకాశాలు కనిపించడం లేదు.

ఎన్‌హెచ్‌పీసీ అధ్యయనం పూర్తయి డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతిందో లేదో తేలితే గానీ కొత్తది నిర్మించడమా లేక పాతదానికే మరమ్మతులు చేసి దానిపైనే ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌ను నిర్మించే అంశంపై స్పష్టత రాదు. ఇదే సమయంలో డయాఫ్రమ్‌వాల్‌కు సమీపంలో మూడుచోట్ల ఏర్పడిన పెద్దపెద్ద గుంతలను పూడ్చడంపై కూడా శాస్త్రీయంగా అధ్యయనం చేయాల్సి ఉంది.

అక్కడున్న వరద నీటిని పూర్తిగా తోడేసిన అనంతరం శాంపిళ్లు తీసి ఏం చేయాలో నిర్ణయిస్తామని సీడబ్ల్యూసీ చెబుతోంది. జెట్‌ గ్రౌటింగ్‌ ద్వారా ముందుకెళ్లాలని డ్యామ్‌ సేఫ్టీ రివ్యూ ప్యానల్‌ సూచిస్తోందని రాష్ట్ర జల వనరుల శాఖ అంటున్నా గోతులు పూడ్చడంపై కేంద్ర జల సంఘం లిఖిత పూర్వకంగా ఆదేశాలు ఇస్తే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేమని స్పష్టం చేస్తోంది.

ఏపీకి చెందిన ముంపుప్రాంతాల వాసులకు సహాయ పునరావాస కార్యక్రమాలకు రూ.28,482 కోట్ల మేర వ్యయం చేయాల్సి ఉందని, ఇప్పుడు తెలంగాణ, ఒడిశా, ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రాల్లోని ముంపుప్రాంతాలకు రూ. 20వేల కోట్ల వరకూ వ్యయం అవుతుందని సాగునీటి రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మొత్తం కలిపి మరో రూ.48వేల కోట్లు అవసరమని, ఇంత పెద్దమొత్తాన్ని భరించేందుకు కేంద్రం అంగీకరించే పరిస్థితి లేదంటున్నారు. పైగా భూసర్వేకు సంవత్సరాలు పడుతుందంటున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలవరం ప్రభావిత రాష్ట్రాలతో కేంద్రం ప్రారంభించిన సంప్రదింపుల ప్రక్రియ కాస్తా రాజకీయాంశంగా మారిపోయిందని చెబుతున్నారు.

ప్రాజెక్టు నిర్మాణంలోకి రాజకీయ ప్రాధాన్యాలు చేరితే సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే పోలవరం వరద నీటిలో చిక్కుకుందని, 2024 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయడం కష్టమేనన్న అభిప్రాయాలను ఈ పరిస్థితిని సమీక్షిస్తున్న నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 7న మరోసారి జరగనున్న సమావేశంలో ఒడిశా, తెలంగాణ, ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రాల డిమాండ్లపై స్పష్టత రావడంతో పాటు కేంద్రం నిర్ణయం కూడా వెల్లడవుతుందని జల వనరుల నిపుణులు పేర్కొంటున్నారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh