ఏపీ రాజధానిపై మాజీ ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు

Venkaiah Naidu's comments on AP capital

ఏపీ రాజధానిపై మాజీ ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు

ప్రస్తుతం ఏపీలో మూడు రాజధానులపై  పెద్ద రాద్ధాంతమే జరుగుతోంది. ఈ మధ్యనే సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఢిల్లీ వేదికగా విశాఖే  రాజధాని అని.. త్వరలోనే అక్కడ్నుంచే కార్యకలాపాలు సాగుతాయని కీలక ప్రకటన చేసేశారు. ఇప్పటిదాకా మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని మాత్రమే జగన్‌ చెబుతూ వచ్చారు. వైజాగ్‌ కు రాజధాని తరలిపోతుందని మాత్రం తొలిసారి గ్లోబల్‌ సమ్మిట్‌ సన్నాహక భేటీలోనే ఆయన ప్రకటించారు. ఆయన ప్రకటన నేపథ్యంలో కొద్దిరోజులుగా రాష్ట్రం రాజకీయంగానూ పాలనాపరంగానూ సెగలు కక్కుతోంది. అయితే, సుప్రీం కోర్టు లో రాజధాని అంశం ఉందని. ఈ సమయంలో సీఎం చేసిన వ్యాఖ్య లు కోర్టు ధిక్కారణ కిందకు వస్తుందంటూ న్యాయనిపుణులు హెచ్చరించారు.

ఈ మొత్తం వ్యవహారంపై ఫిబ్రవరి-23న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఆ రోజు సుప్రీంకోర్టు ఏం తీర్పు వెలువరిస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో మూడు రాజధానులపై తాజాగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో RKR కాలేజీలో జరిగిన ఓ కార్యక్రమానికి వెంకయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా విద్యార్థిని నుంచి రాజధానిపై ప్రశ్న ఎదురైంది. దీనిపై వెంకయ్య స్పందిస్తూ కీలక వ్యాఖ్యలే చేశారు. తాను వివాదాస్పద అంశాల జోలికి వెళ్లనని రాజధాని ఏర్పాటు అనేది ప్రజాభిప్రాయం ప్రకారమే జరగాలన్నారు. అమరావతిపై తన అభిప్రాయం ముందే చెప్పానని మరోసారి గుర్తు చేశారు వెంకయ్య. కేంద్రమంత్రిగా ఉన్నప్పుడే ప్రధానితో కలిసి శంకుస్థాపనలో పాల్గొన్న విషయాన్ని కూడా గుర్తు చేశారాయన. అంతేకాదు అమరావతి అభివృద్ధికి మంత్రిగా నిధులు కూడా మంజూరు చేశానన్నారు. ఈ మాటలను బట్టి అందరికీ అర్థమై ఉంటుందని అనుకుంటున్నానని వెంకయ్య క్లారిటీ ఇచ్చారు. ఈ కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో చర్చకు దారితీశాయి.

ముఖ్యమంత్రి, పాలనా యంత్రాంగం, హైకోర్టు, అసెంబ్లీ అన్నీ ఒక్క చోటే ఉండాలని అప్పట్లో వెంకయ్య చెప్పుకొచ్చారు. ఇలా అన్ని ఒక్క చోట ఉంటేనే పాలనలో అబివృద్ది ఉంటుందని. అది ఎక్కడ అనేది రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయమన్నారు. 42 ఏళ్ల అనుభవంతో ఈ మాట చెబుతున్నట్లు వెంకయ్యనాయుడు గారు తెలిపారు . తన అభిప్రాయాన్ని వివాదం కోసమో, రాజకీయ కోణంలోనో చూడొద్దని కూడా ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ కేంద్రం తనను రాజధాని విషయం అడిగినా ఇదే విషయమే చెబుతానని వెంకయ్య తెలిపారు.

ఇది కూడా చదవండి :

Leave a Reply