నేడు హైదరాబాద్ కు చేరుకున్న ప్రధాని

PM Modi Hyderabad Tour:నేడు హైదరాబాద్ కు చేరుకున్న ప్రధాని

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం 11 గంటల 35 నిమిషాలకు బేగంపేట విమానాశ్రయం చేరుకున్నారు. ప్రోటోకాల్ ప్రకారం గవర్నర్ తమిళ్ సై ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బేగంపేట విమానాశ్రయంలో స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రధానికి విమానాశ్రయంలో రాష్ట్రమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, డీజీపీ అంజనీ కుమార్ యాదవ్, సీఎస్ శాంతి కుమారి కూడా స్వాగతం పలికారు. మరోవైపు బీజేపీ ముఖ్య నేతలు కూడా ప్రధానికి స్వాగతం పలికారు. నగరంలో రెండు గంటల పర్యటనలో భాగంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చెయ్యనున్నారు. ఈ కార్యక్రమాలలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొననున్నారు.తెలంగాణా పర్యటనపై ప్రధాని మోడీ తన ట్విట్టర్ ఖాతాలోనూ ట్వీట్ చేశారు. హైదరాబాద్‌కు బయలుదేరి అక్కడ సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించి, ఇతర అభివృద్ధి పనులను ప్రారంభించడం లేదా వాటి శంకుస్థాపనలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్ పర్యటనలో భాగంగా 11 వేల 355 కోట్ల రూపాయిల విలువ గల పలు ప్రాజెక్టులకు వర్చ్యువల్ పద్ధతిలో ప్రారంభోత్సవాలు, భూమిపూజ చేస్తారు.

అయితే సీఎం పూర్తిగా పర్యటనకు దూరంగా ఉండటంతో మంత్రి తలసాని ప్రధానికి ఆహ్వానం వరకే పరిమితం అయ్యే అవకాశం ఉంది. ఇతర మంత్రులు హాజరయ్యే ఛాన్స్ లేదు. ఇక, పూర్తిగా అధికారిక కార్యక్రమం కావటంతో ప్రధాని ప్రసంగంలో రాజకీయ ప్రస్తావన ఉంటుందా లేదా అనేది చూడాలి.

ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ కేంద్రంగా మోడీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. పరివార్వాది పార్టీ బిజెపి అని, అలాగే దేశవ్యాప్తంగా బిజెపి సాధించిన విజయాలు అంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

అసలు భయపడటం అవసరమా అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోలతో రావణాసురుడు బొమ్మని ఏర్పాటుచేసి కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడి, సిబిఐ, ఐటీలను ఇష్టం వచ్చినట్టుగా వాడుతూ భయపెట్టడానికి మోడీ ప్రయత్నం చేస్తున్నారని బిజెపి హమ్లా మోర్చా పార్టీ అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. తెలంగాణా రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని మండిపడుతున్నారు.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh