AIR INDIA: ఎయిర్ ఇండియా సిబ్బంది పై ప్రయాణికుడు దాడి
విమానాల్లో ప్రయాణికుల అనుచిత ప్రవర్తన శ్రుతిమించుతోంది. తాజాగా, ఎయిరిండియా విమానంలో మరోసారి ప్రయాణికుడి అనుచితంగా ప్రవర్తించాడు. దీంతో ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయలుదేరిన విమానం తిరిగి ఢిల్లీకి వచ్చేసింది. ఇద్దరు క్యాబిన్ సిబ్బంది పట్ల ప్రయాణికుడు వికృతంగా ప్రవర్తించడంతో టేకాఫ్ అయిన మూడు గంటల తర్వాత మళ్లీ విమానం వెనక్కి వచ్చిందని ఎయిరిండియా తెలిపింది. అతడ్ని విమానం నుంచి దింపి, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదయ్యింది. సోమవారం ఉదయం 6.52 గంటలకు ఢిల్లీలో టేకాఫ్ అయిన విమానం తిరిగి ఉదయం 9.36 గంటలకు ఇందిరా గాంధీ విమానాశ్రయానికి చేరుకుంది. న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిరిండియా విమానంలో సహ ప్రయాణికురాలిపై మద్యం మత్తులో ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసిన ఘటన జరిగిన నెల రోజుల తర్వాత ఈ షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ప్రయాణికుల అనుచిత ప్రవర్తన చర్చనీయాంశమయ్యింది. వీటికి అడ్డుకట్ట వేసేందుకు కఠినమైన మార్గదర్శకాలను జారీ చేసేలా విమానయాన సంస్థలను ప్రేరేపించింది.
‘లండన్‌లోని హీత్రూ విమానాశ్రయానికి బయలుదేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఒక ప్రయాణికుడి తీవ్రమైన వికృత ప్రవర్తన కారణంగా తిరిగి వచ్చింది’ అని ఎయిర్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. ‘ప్రయాణికుడు మౌఖిక, లిఖితపూర్వక హెచ్చరికలను పట్టించుకోకుండా వికృత ప్రవర్తనతో పాటు ఇద్దరు క్యాబిన్ సిబ్బందికి శారీరక హాని కలిగించాడు. పైలట్ ఇన్ కమాండ్ ఢిల్లీకి తిరిగి రావాలని నిర్ణయించుకున్నాడు.. ల్యాండింగ్ తర్వాత ప్రయాణీకుడిని భద్రతా సిబ్బందికి అప్పగించారు. పోలీసులకు ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది’ అని పేర్కొంది.
అయితే విమానంలో ఉన్న ప్రతి ఒక్కరి భద్రత,రక్షణ, గౌరవం ఎయిరిండియాకు ముఖ్యమని నొక్కి చెబుతూ.. ప్రయాణికులకు కలిగించిన అసౌకర్యానికి చింతిస్తున్నాం.. ఈ మధ్యాహ్నం లండన్‌కు బయలుదేరడానికి విమానాన్ని రీషెడ్యూల్ చేశాం’ అని వివరించింది.